సస్పెన్స్ తో థ్రిల్ చేసిన కోకిల – Nostalgia

ఇప్పుడంటే క్రైమ్ థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది కానీ ఒకప్పుడు కమర్షియల్ సబ్జెక్టులు తప్ప దర్శకులు ఎక్కువ ప్రయోగాలు చేసేవారు కాదు. ఎందుకంటే వీటికి ప్రేక్షకులు తక్కువగా ఉంటారు. మాస్ ని ఇవి ఆకట్టుకోలేవు. ఈ పరిమితిని దృష్టిలో ఉంచుకునే కథకులు సైతం ఇలాంటి యాంగిల్ లో ఆలోచించేవారు కాదు. కానీ అప్పటి మూస పరిస్థితులను తట్టుకుని ఎదురునిలిచి చేసిన ప్రయత్నమే 1991లో వచ్చిన కోకిల. దర్శకుడు గీతాకృష్ణ. అప్పటికి ఆయనది ఒక్క సినిమా అనుభవమే. నాగార్జునతో చేసిన సంకీర్తన డిజాస్టర్. అయినా రెగ్యులర్ ఫార్ములా జోలికి వెళ్ళకుండా కోకిలతో సాహసం చేశారు. ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా కథను తయారు చేశారు.

గొప్ప పేరుప్రతిష్టలు ఉన్న ఓ స్వామిజి హత్య చేయబడతారు. ఆయన కళ్ళను యాక్సిడెంట్ లో వాటిని పోగొట్టుకున్న సిద్ధార్థ(నరేష్)కు అమరుస్తారు. అయితే ఆ మర్డర్ ని చూసినట్టుగా సిద్దార్థ తీవ్ర కలవరానికి గురై తాత్కాలికంగా మళ్ళీ చూపుకు దూరమవుతాడు. అప్పుడు భార్య కోకిల(శోభన)కు సంఘర్షణ మొదలతుంది. ఆ దుర్మార్గానికి ఒడిగట్టిన వాళ్ళు ఆమెకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెడతారు. రక్షణగా కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్(శరత్ బాబు)నిలబడతాడు. ఆ తర్వాత సిద్ధార్థకు ఏమయ్యింది, హత్య చేసినవాళ్ళు ఎవరు అనేది సినిమాలోనే చూడాలి. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిన కోకిలలో చాలా విశేషాలు ఉన్నాయి. నటులు ఎల్బి శ్రీరామ్ గారికి రచయితగా ఇది మొదటి సినిమా.

టైటిల్ సాంగ్ లో ఇళయరాజా ఫోటోలు పెట్టి దర్శకుడు షూట్ చేయడం ఎవరికీ రాని ఐడియా. నరేష్ సగం సినిమాకు పైగా అంధుడిగానే కనిపిస్తాడు. విలన్ ఎవరు అనేది చివరిదాకా అంతు చిక్కదు. ఇళయరాజా పాటలు అప్పట్లో ఛార్ట్ బస్టర్స్. శోభన నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కనిపించని రూపంతో డబ్బింగ్ తో సాయి కుమార్ ఇచ్చిన విలన్ వాయిస్ కోకిలకు ప్రధాన ఆకర్షణ. మొదటి అరగంట కొంత రొటీన్ గా అనిపించినా ఆ తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఇదిచ్చిన డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కు కోకిల మంచి విజయం దక్కించుకుంది. తన మీదే ఉన్న భారాన్ని శోభన చాలా చక్కగా మోసి ఈ చిత్రానికి ప్రాణం పోశారు. రంగనాథ్, గీత, కోట శ్రీనివాసరావు, నాజర్, శివకృష్ణ, సిఎస్ రావు తదితరులు కీలక పాత్రలు పోషించిన కోకిల ఇప్పటికీ ఒక విభిన్న చిత్రంగా చెప్పుకోవచ్చు.

Show comments