iDreamPost
iDreamPost
ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ పెరిగిపోవడంతో అన్ని పెద్ద నగరాల్లోనూ మెట్రోని నిర్మించారు. కొన్ని నగరాల్లో ఇంకా నిర్మిస్తున్నారు. మెట్రో సర్వీసుల వల్ల గమ్యానికి తొందరగా వెళ్తున్నాం.ట్రాఫిక్,పొల్యూషన్ నుంచి తప్పించుకుంటున్నాము. అయితే ఈ మెట్రో ట్రైన్ సర్వీస్ లు ఇప్పడు చాలా నగరాల్లో కామన్ అయిపోయాయి. తాజాగా కేరళ కొచ్చిలో మొట్టమొదటిసారిగా వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభించబడింది.
మనం చాలా సినిమాల్లో కేరళలోని కొన్ని ఊర్లకి పడవల మీద వెళ్లడం చూశాం. కొచ్చి దగ్గర రెండు నదులు ఉండటం, పక్కనే ఉన్న సముద్రం నుంచి కొన్ని పాయలు లోపలికి రావడం వల్ల అక్కడ చిన్న చిన్న దీవులుగా కొన్ని ఊర్లు ఉన్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, దీవులు పడవలని ఉపయోగించి రవాణా చేస్తూ ఉంటారు. మనుషులు, వస్తువులు అన్ని పడవలని ఉపయోగించే చేస్తూ ఉంటారు. దీనిని మన తెలుగు సినిమాల్లోనే చాలా చోట్ల చూశాం. అయితే తాజాగా అక్కడి ప్రజల బాధలని తీర్చడానికి, ఆ ఊర్ల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి, మరింత సులువుగా ప్రయాణం చేయడానికి కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభించారు.
ఈ వాటర్ మెట్రో చూడటానికి రైలులా కనిపించినా ఇది ఒక హైబ్రిడ్ పడవ. ఈ మెట్రో పడవలని, అవి ఆగడానికి స్టేషన్స్ లాంటి టెర్మినల్స్ ని, కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్, కొచ్చి షిప్ యార్డులు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మెట్రో పడవ తెలుపు, నీలం రంగులతో ఉంది. ఇప్పటికే 10 దీవులను కలుపుతూ మొత్తం 38 టెర్మినల్స్ ని నిర్మించారు. రెండు రకాల మెట్రో పడవలని అందుబాటులోకి తీసుకొచ్చారు. పెద్ద పడవలో 100 మంది, చిన్న పడవలో 50 మంది ప్రయాణించవచ్చు.
మొదటి వాటర్ మెట్రో ట్రయల్ రన్ ఇటీవలే మార్చిలో నిర్వహించబడింది. ఇది వైట్టి, కాక్కనాడ్ టెర్మినల్స్ మధ్య జరిగింది. ట్రయల్ రన్‌లో ఈ వాటర్ మెట్రో పడవ 5 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకుంది. ఇప్పటివరకు 15 మెట్రో రూట్లను 10 ద్వీపాల మీదుగా గుర్తించి 38 టెర్మినళ్లను నిర్మిస్తున్నారు.
మొత్తంగా ఈ 15 మార్గాల ద్వారా 76 కిలోమీటర్లు కవర్ చేయనున్నారు. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో, ఆ దీవులలో నివసించే ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుతం ట్రయిల్ రన్ గా నడుస్తున్న ఈ వాటర్ మెట్రో సర్వీసులు జూన్ కల్లా పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రానున్నాయి. దీనిపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వాటర్ మెట్రోలో ప్రయాణించాలి అనుకుంటే కొచ్చికి వెళ్లాల్సిందే.