Huzurabad Gangula Kamalakar Harish Rao – హుజురాబాద్ ఓటమి ప్రభావం హరీష్ ,గంగుల మీద లేనట్లేనా?

హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం కాస్త ఎక్కువగా జరిగింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే కచ్చితంగా ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందని, లేకపోతే మాత్రం వారి ప్రాధాన్యత తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు కంటే కూడా సీఎం కేసీఆర్ చేసే రాజకీయం మాత్రమే ఇక నుంచి మరో రకంగా ఉంటుంది అనే అభిప్రాయం తాజాగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒక క్లారిటీ వచ్చేసింది.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన ప్రధాన ప్రత్యర్థి అని చెప్పిన సీఎం కేసీఆర్,హరీష్ రావు ప్రాధాన్యత విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే హరీష్ రావు ని సీఎం కేసీఆర్ పక్కన పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరిగిన నేపథ్యంలో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థిక శాఖ సమీక్ష విషయంలోగాని సీఎం కేసీఆర్… హరీష్ రావు ని పక్కన కూర్చోబెట్టుకున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసే ముందు హరీష్ రావు తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం విషయంలో అలాగే రాష్ట్ర బిజెపి విషయంలో ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది అనే దానికి సంబంధించిన హరీష్ రావు సలహాలు తీసుకుని సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో హరీష్ రావు తీవ్రస్థాయిలో కష్ట పడిన సంగతి తెలిసిందే. అయితే ఫలితం కాస్త ఇబ్బందికరంగా రావడంతో సీఎం కేసీఆర్, హరీష్ రావు పై ఆగ్రహంగా ఉన్నారని, గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా హరీష్ రావు కారణంగానే ఓడిపోయామనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నారని, అందుకే ఆయనను పక్కన పెట్టే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

కానీ హరీష్ రావు విషయంలో సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను కొనసాగించారు. ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ని కూర్చోబెట్టుకొన్న కేసీఆర్ మరోవైపు హరీష్ రావు ని కూర్చోబెట్టుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ ను కూడా కేసీఆర్ మీడియా సమావేశంలో దగ్గర్లో కూర్చోబెట్టుకున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి పక్కన గంగుల కమలాకర్ ఉన్నారు. దీనితో ఇద్దరు మంత్రులను సీఎం కేసీఆర్ పక్కన పెట్టే అవకాశం లేదనే క్లారిటీ కొంత మందికి వచ్చింది.

అయితే గంగుల కమలాకర్ ను పక్కన పెడతారా లేదా అనే దానిపై స్పష్టత లేకపోయినా హరీష్ రావుని మాత్రం సీఎం కేసీఆర్ ఖచ్చితంగా పక్కన పెట్టే అవకాశం లేదని ఆయన ప్రాధాన్యత కూడా తగ్గించే అవకాశం లేదని, త్వరలోనే సిద్దిపేట నియోజకవర్గానికి కూడా సీఎం కేసీఆర్ వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హరీష్ రావు ని పక్కన బెడితే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ మరింతగా ఇబ్బంది పడే అవకాశం ఉండటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది… కాబట్టి సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Show comments