TDP CBN Lokesh-లోకేష్‌తో న‌ష్ట‌మేన‌ని బాబు కూడా భావిస్తున్నారా?

ప్ర‌స్తుతం పార్టీని బ‌లోపేతం చేయ‌డం చంద్ర‌బాబు ముందున్న ప్ర‌ధాన క‌ర్త‌వ్యం. ఎందుకంటే ఈ రెండున్న‌రేళ్ల కాలంలో టీడీపీకి జ‌రిగిన న‌ష్టం అంతా ఇంతా కాదు. ప్ర‌జ‌ల్లోనే కాదు.. సీనియ‌ర్ నాయ‌కుల్లో కూడా పార్టీపై అసంతృప్తి పెరిగింది. అందుకు జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న సంతృప్తి ఓ కార‌ణ‌మైతే, జ‌గ‌న్ కు వ‌స్తున్న పేరును చూసి ఓర్వలేక అభివృద్ధి, ప‌థ‌కాల‌ను అడ్డుకోవ‌డానికి టీడీపీ కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌డం మ‌రో కార‌ణం. ప్ర‌ధానంగా ఇళ్ల స్థ‌లాల‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం ఆ పార్టీకి మాయ‌ని మ‌చ్చ‌గా మారింది. ఇప్పుడు ఈ మ‌చ్చ‌ల‌ను చెరుపుకునే ప‌నిలో బాబు బిజీగా ఉన్నారు. అలాగే, పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కుల‌కు నేనున్నా అంటూ భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనికి ప‌ట్టాభి ఎపిసోడ్ ను అనువుగా మార్చుకోవాల‌ని ప్లాన్ చేశారు.

సీనియ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాలంటే.. కొడుకును కాస్త దూరం పెడితే మంచిద‌నే భావ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌న్న వార్త‌లు ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను అందుకు నిద‌ర్శ‌నంగా ప్ర‌చారం చేస్తున్నారు.

బాబు టూర్ లో చిన‌బాబు లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. బాబు తర్వాత ఆ స్థానంలో కూర్చోవాల్సిన వ్యక్తి, ఇప్పటినుంచీ అన్నీ తానై నడిపించాలని అనుకుంటున్న వ్యక్తి, భావి టీడీపీ అధ్యక్షుడు.. నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లలేదు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఏపీలో చేస్తున్న యాక్ష‌న్ అంతా ఇంతా కాదు. ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రాన్ని కోరుతోంది. నేరుగా రాష్ట్రప‌తిని కూడా క‌లిసింది. మ‌రి కూడా లోకేశ్ ఎందుకు తీసుకెళ్ల‌లేద‌నేదే ఇప్పుడు ప్ర‌శ్న.

గ‌త ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయాక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కొడుకును ముందుకు పంపి.. తెర వెనుక మంత్రాంగం న‌డ‌పాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేశారు. అధికారంలో ఉండ‌గానే ఎమ్మెల్సీ పేరుతో ఆయ‌న తెర‌పైకి తెచ్చి మంత్రి హోదా క‌ల్పించారు. ఆ స‌మ‌యంలోనే సీనియ‌ర్ల‌కు, లోకేష్ కు మ‌ధ్య భారీ యుద్ద‌మే జ‌రిగింది. కానీ అధికారంలో ఉండ‌డంతో అప్ప‌ట్లో పెద్ద‌గా బ‌హిర్గ‌తం కాలేదు. 2019లో అధికారం కోల్పోయాక ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దీనికి తోడు క్షేత్ర స్థాయిలో పార్టీ ఫెయిల‌వుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు వ్యూహం మార్చుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి లోకేష్ స్పీడును కాస్త త‌గ్గించ‌డ‌మే బెట‌ర్ అనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొంత మంది సీనియ‌ర్ల‌కు, లోకేష్ కు పొస‌గ‌ని నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యానికి వ‌చ్చార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

వాస్తవానికి చంద్రబాబు తనతో పాటు కొడుక్కి కూడా సరైన ప్రమోషన్ కావాలనుకుంటే ఢిల్లీ టూర్ కి ఆయన్ని కూడా తీసుకెళ్లాల్సింది. అక్కడ అందరికీ పరిచయం చేస్తూ తన రాజకీయ చాణక్యాన్ని నేర్పించాల్సింది. కానీ ఆయన ఆ పని చేయలేదు. కొడుకుని పక్కనపెట్టారు. కొడుకునే కాదు, కొడుకుతో రాసుకుపూసుకు తిరిగే ఓ బ్యాచ్ ని కూడా చంద్రబాబు కొంత కాలంగా పక్కనపెడుతున్నారని, ఈ విషయంలోనే తండ్రీ కొడుకుల మధ్య అంతరం పెరుగుతోందనే వాద‌న కూడా తెర‌పైకి వ‌స్తోంది. పార్టీ కీల‌క‌మైన అడుగు వేసిన‌ప్పుడు అందులో లోకేష్ కు స్థానం లేక‌పోవ‌డం ఈ త‌ర‌హా చ‌ర్చ‌ల‌కు అన్నింటికీ కార‌ణంగా మారింది. మ‌రి అస‌లు కార‌ణం ఏంట‌నేది చంద్ర‌బాబుకే తెలియాలి.

Also Read : Lokesh In The View Of ABN RK – పాపం లోకేష్… రాధాక్రిష్ణ కూడా తీసిపారేశాడుగా!

Show comments