Idream media
Idream media
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఒక్కొక్కసారి ఒక్కో పార్టీ గెలుస్తుంది. అది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే కొన్నిపార్టీలు, కొంత మంది నేతలు.. గెలిచినప్పుడు సంబరాలు చేసుకుని, ఓడిపోయినప్పుడు మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. ప్రజా తీర్పును అవగౌరవ పరిచేలా పోలింగ్ తీరునే తప్పుబడుతూ.. రాజకీయాల్లో హుందాతనానికి పాతరేస్తున్నారు. తాజాగా జరిగిన బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ తర్వాత.. బీజేపీ ఈ తరహా రాజకీయానికి తెరలేపింది.
పోలింగ్ ముగిసిన మరుసటి రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. బద్వేలులో భారీగా దొంగ ఓట్లు పోలయ్యాయని ఆరోపించారు. గోపవరం, కాశీనాయన, బద్వేలు, అట్లూరు మండలాల్లోని 28 పోలింగ్ కేంద్రాల్లో 30 వేల దొంగ ఓట్లు వేశారని, అక్కడ మళ్లీ రీపోలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ 30 వేల ఓట్లు తొలగించి ఫలితాలు ప్రకటిస్తే.. తమకు అభ్యంతరం లేదన్నారు. అంతేకాకుండా ఉప ఎన్నిక ఫలితం ప్రకటించకుండా ఆపాలంటూ సుప్రిం కోర్టులో కేసు వేశామన్నారు. బీజేపీ కేంద్ర బలగాలను రప్పిస్తే.. బీజేపీ ఏజెంట్లు వీక్‌గా ఉన్న చోట వారిని నియమించి.. వైసీపీ స్టాంపింగ్ చేసుకుందన్నారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించిందని, వైసీపీకి గెలిచే సత్తా ఉంటే ఇన్ని అక్రమాలకు ఎందుకు పాల్పడిందని సోము వీర్రాజు తమకు ఎదురుకాబోతున్న ఘోర ఓటమికి ముందే కారణాలు వెతుక్కున్నారు.
Also Read : TDP – BJP : బద్వేల్ ఉప ఎన్నిక : టీడీపీ అందుకే తప్పుకుందా..?
బీజేపీ ఓటమికి కారణాలు వెతుక్కోవడం వరకు బాగానే ఉంది కానీ.. ఆ ఆరోపణలు చేసే ముందు అందులో అర్థం ఉందా..? లేదా..? అనేది సోము మరిచిపోయినట్లున్నారు. 28 కేంద్రాలలో 30 వేల దొంగ ఓట్లు వేశారన్నారు సోము వీర్రాజు. సాధారణంగా ఒక్కొక్క పోలింగ్ బూత్‌లో గ్రామీణ ప్రాంతాలలో గరీష్టంగా 900 ఓట్లు, పట్టణ ప్రాంతాలలో 1100 ఓట్లు ఉంటాయి. సోము చెబుతున్న 28 పోలింగ్ కేంద్రాలు అన్నీ గ్రామీణ ప్రాంతాలలోనివే. నిబంధనల మేరకు ఈ 28 పోలింగ్ కేంద్రాలలో గరీష్టంగా 25,200 ఓట్లు ఉంటాయి. సోము వీర్రాజు మాత్రం 30 వేల దొంగ ఓట్లు పడ్డాయంటున్నారు. ఆయా పోలింగ్ బూత్‌లలో ఉన్న ఓట్ల కన్నా.. సోము వీర్రాజు చెబుతున్న దొంగ ఓట్ల సంఖ్యనే ఎక్కువ. అంటే ఆయా బూత్‌లలో 100 శాతం కన్నా ఎక్కువగా పోలింగ్ నమోదై ఉండాలి. పైగా.. ఆ 28 బూత్‌లలోని ఓటర్లలో ఏ ఒక్కరు కూడా ఓటు వేసేందుకు రాలేదన్న మాట. సోము వీర్రాజు మాటలను బట్టీ ఆ పోలింగ్ బూత్‌లలోని అన్ని ఓట్లే కాదు.. అంతకన్నా ఎక్కువగా వైసీపీ వాళ్లు స్టాంపింగ్ వేసుకున్నారని అనుకోవాలా..?
ఈ తరహాలో ఆరోపణలు చేయడం వల్ల సోము వీర్రాజు తన పార్టీ పెద్దలకు ఓటమిపై ముందే సమాధానం చెప్పినట్లువుతుంది. బీజేపీ కార్యకర్తలు డీలా పడకుండా కూడా చేసినట్లు అవుతుంది. కానీ ఓ ముఖ్యమైన విషయం సోము వీర్రాజు ఇక్కడ మరిచినట్లున్నారు. ఈ తరహా ఆరోపణలు చేయడం అంటే.. ఓట్లు వేసిన వారిని అవమానించనట్లే. వారు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసినట్లే. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహాలో వ్యవహరించిన వారిలో సోము వీర్రాజు మొదటి వారు కాకపోడం.. ఆయనకు అంతో ఇంతో ఊరటనిచ్చే అంశం. అంతకు ముందు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు 2019 సాధారణ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినతీర్పును అగౌరవ పరిచేలా వ్యవహరించారు. ఆయన చూపిన బాటను.. సోము వీర్రాజు లాంటి నేతలు కూడా అనుసరిస్తుండడమే విచారకరం.
Also Read : By Election Polling Percentage – అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ..