నా బ‌జాజ్

బ‌జాజ్ ఒక పేరు కాదు. ఒకప్పుడు ల‌క్ష‌ల మంది యువ‌కుల క‌ల‌. 1970 నాటికి న‌గ‌రాల్లో త‌ప్ప స్కూట‌ర్లు చిన్న వూళ్ల‌లో లేవు. ధ‌నికుల‌కే త‌ప్ప మామూలు వాళ్ల‌కి అందుబాటులో లేని కాలం. మోపెడ్ కూడా చాలా త‌క్కువ మందికే ఉండేది. 80 త‌ర్వాత హీరో మెజిస్టిక్ , లూనాలు వ‌చ్చి ఇన్‌స్టాల్‌మెంట్ ప‌ద్ధ‌తిలో కొంత మందికి చేరువ‌య్యాయి.

స్కూట‌ర్ అంటే వెస్పానే అనుకునే రోజుల్లో బ‌జాజ్ వ‌చ్చింది. కుర్రాళ్ల‌కి క్రేజ్‌, కొత్త దంప‌తులు బ‌జాజ్‌లో తిరిగితే ఆ కిక్కే వేరు. బ‌జాజ్‌కి ఎంత డిమాండ్ అంటే బుక్ చేస్తే ఎప్ప‌టికో వ‌చ్చేది. చాలామంది బ్లాక్‌లో అమ్ముకునేవాళ్లు. 85 త‌ర్వాత బ‌జాజ్50 బుకింగ్ కోసం అనంత‌పురం స్టేట్ బ్యాంక్ వ‌ద్ద క్యూని కంట్రోల్ చేయ‌డానికి పోలీసులు అవ‌స‌ర‌మ‌య్యారు.

నాకు స్కూట‌ర్ కొనాల‌ని కోరిక బ‌లంగా ఉన్నా కొన‌లేని స్థితి. ఆంధ్ర‌జ్యోతిలో నా జీతం 1400. బ‌జాజ్ చేత‌క్ ఖ‌రీదు రూ.13 వేలు. పెళ్లైన త‌ర్వాత భార్య‌ని సైకిల్‌లో తిప్పితే బాగుండ‌ద‌ని 1990లో నానా తిప్ప‌లు ప‌డి కొన్నాను. డ‌బ్బులు క‌ట్ట‌డానికి వెళితే బ‌జాజ్ డీల‌ర్లు ఎంత లెవెల్ చూపారంటే స్టాక్ లేదు, మూడు నెల‌లు wait చేయ‌మ‌న్నారు. రెక‌మెండేష‌న్ చేయిస్తే ఆ టైం నెల‌కి త‌గ్గింది. స్పీడ్ డెలవ‌రీకి 500 extra అన్నారు.

మొత్తానికి బ్లూబ‌జాజ్ చేత‌క్ 1990, డిసెంబ‌ర్‌లో చేతికి వ‌చ్చింది. దాన్ని నేరుగా తీసుకెళ్లి తిరుప‌తి గంగ‌మ్మ గుడిలో పూజ చేయించాను. త‌ర్వాత పిచ్చెక్కినవాడిలా స్కూట‌ర్‌ని తిప్పాను. తిరుప‌తి నుంచి బ్ర‌హ్మంగారిమ‌ఠం 230 కిలోమీట‌ర్లు ప‌ర‌మ అధ్వాన్న‌మైన రోడ్ల‌లో ప్ర‌యాణించాను. తిరుమ‌ల కొండ‌కి ఎన్నిసార్లు వెళ్లానో గుర్తులేదు. ఒక‌సారి కొండ‌ని దిగుతున్న‌ప్పుడు పంక్చ‌ర్ అయింది. ఒక లారీలో ఎక్కించి , ఆ మ‌లుపుల్లో అది మీద‌కి దొర్ల‌కుండా న‌ర‌కం చూశాను.

జీవితంలో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల్లో ఒక ద‌శాబ్దం తోడుగా ఉంది. పెట్రోల్ అయిపోతే తోయించింది, ముగ్గురు ఎక్కినందుకు జ‌రిమానా వేయించింది. పెద్ద‌గా దెబ్బ‌ల్లేకుండా కింద ప‌డ‌దోసింది. మా ఆవిడ‌ని జాగ్ర‌త్త‌గా చూసుకుంది. మా అబ్బాయిని షికార్లు తిప్పింది. ఉద్యోగానికి స‌కాలంలో తీసుకెళ్లింది. ఎన్నో ఇన్వెస్టిగేష‌న్ స్టోరీలు రాయించింది. ఇంత స‌ర్వీస్ చేసిన దాని నెంబ‌ర్‌ని కూడా గుర్తుంచుకోని దుర్మార్గున్ని. పెట్రోల్ ఎక్కువ తాగుతోంద‌ని అమ్మేసిన వాన్ని.మ‌నుషుల ల‌క్ష‌ణం ఇది. జ్ఞాప‌కాలు త‌లుచుకుంటాం కానీ. మ‌న‌కి సంతోషాల్ని పంచిన వాళ్ల కోసం ఏం చేశామో గుర్తు చేసుకోం. ఎందుకంటే మ‌నం చేసిందేమి ఉండ‌దు కాబ‌ట్టి. ఇది వ‌స్తువుల‌కైనా, మ‌నుషుల‌కైనా వ‌ర్తిస్తుంది.

Show comments