నిమ్మగడ్డ ఆలోచన కు హైకోర్టు బ్రేక్‌

ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఏపీఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వరుసగా బ్రేక్‌లు పడుతున్నాయి. ప్రజా ప్రతినిధులపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విధించిన ఆంక్షలను ఎత్తివేసిన హైకోర్టు తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయానికి బ్రేక్‌ వేసింది. ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారనే ఫిర్యాదులు చేస్తే.. మళ్లీ నామినేషన్‌ వేసే అవకాశం ఇస్తామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ నెల 18వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేస్తే ఆ మేరకు పరిశీలించి అవకాశం కల్పిస్తామని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీలోపు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆలోచనలకు ఏపీ హైకోర్టులో బ్రేక్‌ పడింది. ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు ఏకగ్రీవాలపై ఎలాంటి నిర్ణయం ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఒకే నామినేషన్‌ దాఖలైన చోట ఎన్నికైనట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్‌ అధికారి ఫాం – 10 జారీ చేసిన స్థానాలపై ఈ నెల 23వ తేదీ వరకు ఎలాంటి విచారణ జరపవద్దన్న కోర్టు.. ఫాం – 10 జారీ చేయని స్థానాలపై ఎమైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని కూడా ఈ నెల 23వ తేదీ వరకు వెల్లడించవద్దని తన ఆదేశాల్లో పేర్కొంది.

ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఆరడి గుంట, సింగిరిగుంట స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచిన ఎంపీటీసీలు, పీలేరు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం – 10 కూడా తీసుకున్న ఏటి రత్న శేఖర్‌రెడ్డిలు హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందా..? ఆ అధికారం ఎక్కడ నుంచి వచ్చింది..? అంటూ కమిషన్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ వివాదాస్పదంగా మారే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష పార్టీలు చేసే డిమాండ్లకు అనుగుణంగా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ఈ నిర్ణయంతో స్పష్టమైంది. పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతే.. అది తమ ఉనికికే ప్రమాదమనే ఆందోళనలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎస్‌ఈసీ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ ఎత్తులు వేసే ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే పలువరు టీడీపీ నేతలు ఏకగ్రీవమైన స్థానాలపై కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తూ నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నారు. ఆర్‌వోల విధుల్లో ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోకూడదని, ఎన్నికైనట్లు ఆర్‌వో ధృవీకరిస్తూ ఫాం – 10 జారీ చేసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ట్రిబ్యూనల్‌ను మాత్రమే ఆశ్రయించాలనే నిబంధనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయాలనేమీ పట్టించుకోని నిమ్మగడ్డ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ తరఫున న్యాయవాదులు కూడా ఆర్‌వో విధుల్లో కమిషనర్‌ జోక్యం చేసుకోరాదని, ఎన్నికైనట్లు ప్రకటించిన తర్వాత సదరు స్థానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం కమిషన్‌కు లేదని హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వారి వాదనలతో ఏకీభవించింది.

Show comments