Idream media
Idream media
మొన్నటి వరకు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిపోయిన హుజురాబాద్, బద్వేలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు.. తమ పార్టీల శ్రేణులతో కలసి తెరవెనుక మంత్రాంగాలు నడుపుతున్నాయి. ఉప ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది గంటలే సమయం ఉండడంతో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి.
రేపు శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం ఆరు గంటలకే సిబ్బంది పోలింగ్‌కు అంతా సిద్ధం చేయనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతోంది. రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పోలింగ్‌ను రాత్రి ఏడు గంటల వరకు పొడిగించారు.
బద్వేలులో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల భవితవ్యాన్ని 2.15 లక్షల ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయబోతున్నారు. 281 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరగబోతోంది. ఎన్నికల సంఘం.. పోలింగ్‌కు 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. తుది ఫలితంపై ఎలాంటి ఆసక్తిలేకపోవడంతో.. ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది..? వైసీపీ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది..? బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉప ఎన్నికల్లోనైనా డిపాజిట్లు దక్కించుకుంటాయా..? అనేవి ఆసక్తికరమైన అంశాలు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యంత ఆసక్తిగా సాగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు 30 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతున్నారు. ఫలితంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 306 పోలింగ్ కేంద్రాలలో 2.09 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నిక జరుగుతుండడంతో.. కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. స్థానిక పోలీసులతోపాటు 20 కంపెనీల బలగాలను రంగంలోకి దించింది.
ఓటు పదివేల రూపాయలు పలికిందనే వార్తల నేపథ్యంలో.. ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందనే ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 85 శాతం పోలింగ్ నమోదైంది. టీఆర్‌ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నా.. ఈ ఎన్నిక కేసీఆర్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మధ్య జరుగుతున్నట్లు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రేపు పోలింగ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. నవంబర్ 2వ తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో ఎవరు విజయం సాధిస్తారు..? కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకుని డిపాజిట్ తెచ్చుకుంటుందా..? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.