బాపు, వేటూరిలు జీవించి ఉంటే రాధా కృష్ణ పోలికల రాతలకు ఏమయ్యేవారో..?

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు సాగుతోంది ఆంధ్రజ్యోతి పాత్రికేయం. జర్నలిజం విలువలకు ఎప్పుడో తిలోదకాలిచ్చేసిన ఎండీ రాధాకృష్ణ పత్రిక ప్రమాణాలను పాతాళంలోకి తీసుకుపోవడానికి రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై తన అక్కసునంతా వెళ్లగక్కుతూ వండి వార్చే వార్తలతో మొదటి పేజీని ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉందని, ఇటు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పాలన పూర్తిగా గాడి తప్పిపోయిందని రేపో మాపో ఈ సర్కారు పడిపోవడం ఖాయం అన్నట్టు బ్యానరు కథనాలు పరిచేస్తుంటారు.

వారానికోసారి కొత్తపలుకు అంటూ బోడిగుండుకు మోకాలికి ముడిపెడుతూ ఆర్కే మార్కు ఎడాపెడా రాసే వ్యాఖ్యలు ఏవిధంగా ఉంటాయో తెలిసిందే. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం, ఆయన కళ్లల్లో ఆనందాన్ని చూడడమే లక్ష్యంగా ఆయన కలం కదం తొక్కుతుంది. వారం వారం ఈ రాతలతో తన లక్ష్యసాధన ఆలస్యమవుతుందని భావించారో ఏమో తాజాగా బుధవారం మొదటి పేజీలో ఓ వింత పోకడ పోయారు.1980లో వచ్చిన రాజాధిరాజ సినిమాలోని కొత్తా దేవుడండీ పాట చరణాలు ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తున్నాయని థియరీ రాశారు. ఆ పాటను విన్న ఎవరికైనా ఈ ప్రభుత్వ తీరు గుర్తుకొస్తుందని మనల్ని హిప్నటైజ్‌ చేశారు.

ఏమి రాస్తిరి.. ఏమి రాస్తిరి..

’అప్పులు గొప్పగ చేయొచ్చండి’ అన్న చరణంపై వ్యాఖ్య రాస్తూ ఇలాంటి పాలకులు వస్తారని అప్పట్లోనే గీత రచయిత ఎలా ఊహించారంటూ హాశ్చర్యపోయారు. ’పీపాలెన్నో తాగొచ్చండి’ అన్న లైను జనంతో నాసిరకం బ్రాండ్ల మద్యం తాగించడమే పనిగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాను ‍అచ్చంగా దించేసిందటూ భాష్యం చెప్పేశారు. ఇప్పటి రాష్ట్ర పరిస్థితి అప్పడే చిత్ర దర్శకుడు బాపు, గీత రచయిత వేటూరి ఎలా ఊహించారో అంటూ వారి పనితీరుకు వీర తాళ్లు కూడా వేసేశారు. 

Also Read : వైయస్సార్ గురించి విప్లవ రచయిత అవంత్స ఏమన్నారు?

అప్పట్లో అయితే నప్పేదేమో..

ఈ పాటను రెండున్నరేళ్ల క్రితం అచ్చేసి ఉంటే సరిగ్గా అతికినట్టు సరిపోయేదని ఈ రచనను చూసినవారికి అనిపిస్తుంది. కరోనా వంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వాలకు ఆర్థికంగా ఊపిరాడని తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ వాస్తవాన్ని కప్పి పుచ్చి ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే అప్పులు చేస్తున్నట్లు రోజూ పచ్చ బ్యాచ్‌ చేసే గోబెల్‌ ప్రచారానికి కొనసాగింపుగా ఏదేదో రాసుకుంటూ పోయారు. ఎలాంటి సంక్షోభం లేని సమయంలో అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేసి, అప్పు చేసిన మొత్తాన్ని ఏం చేశారో ఇప్పటికి చెప్పలేని చంద్రబాబు పాలనా కాలంలో రాధాకృష్ణకు ఈ పాట ఎందుకు గుర్తుకురాలేదో? అప్పు తెచ్చిన ప్రతి రూపాయికి పక్కాగా లెక్క చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం ఏ విధంగా ఈ పాట ప్రతిబింబించిందో! బెల్ట్‌షాపులు పెట్టి ఊరూవాడా జనానికి మద్యం అందుబాటులో ఉండేట్టు చేయడమే గాక స్వయంగా కేబినెట్‌ మంత్రి అయిన జవహర్‌ మద్యం హెల్త్‌ డ్రింక్‌ అంటూ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం, బార్లకు అనుమతులు బార్లా తెరవడం రాధాకృష్ట మరచిపోయారేమో!

వారు చచ్చి బతికిపోయారు..

ఈ పాటతో సంబంధం ఉన్నవారందరూ గతించినా గీతం సజీవంగా నిలిచిపోయిందంటూ ముక్తాయింపు ఇచ్చేశారు. నిజంగా ఈ పాటతో సంబంధం ఉన్నవారు బతికుంటే తమ సాహిత్యానికి, సృజనకు వక్రభాష్యం చెప్పిన ఈ పాత్రికేయ పైశాచికాన్ని చూసి గుండెలు పట్టుకునేవారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు రాలనట్టే తన రాతలకు ప్రభుత్వాలు కూలవు అన్న సంగతి రాధాకృష్ణ ఎప్పుడు తెలుసుకుంటారో! 

Also Read : జ‌గ‌న్ విష‌యంలో ముగ్గురూ.. ఒక్క‌టేనా..!?

Show comments