చిరకాలం గుర్తుండే బండేరు కోన యాత్ర

  • Published - 07:28 AM, Tue - 22 June 21
చిరకాలం  గుర్తుండే  బండేరు కోన యాత్ర

చిన్న చిన్నవి పక్కన పెడితే మొత్తంగా అడవుల్లో శోధన మొదలైంది గత సంవత్సరం సంక్రాంతి రోజు మేము నల్లమలలో చేసిన కొండపొలం యాత్ర. గరుడాద్రి వరకు. ఆ తర్వాత ఫిబ్రవరిలో జ్యోతి నుండి అహోబిలం వరకూ నడక. అబ్బో అనిపించింది.

తర్వాత లాక్ డౌన్. కరోనా అందరికీ బాధలు పంచినా అడవుల్లో మన తిరుగుళ్లకు వెండి వాకిళ్లు తెరిచింది. లంకమల, మల్లుగాని బండ, నాగేష్ కొండ, దుర్గమ్మ కొండ, పెంచల కోన, నిత్యపూజ కోన, ఘటిక సిద్దేశ్వరం, మల్లెం కొండ, గుబ్బ కొండ, సదురు బండ, మఠం కొండలు, వెలిగొండలు, తూరుపు కొండలు, తీర్థాలు, సాలంక ఇలా ఎక్కడికి పొయినా ఒక్కో దానిది ఒక్కో విశిష్టత. తిరిగే ఓపిక ఉండాలే గానీ ఒకదాన్ని మించి మరొకటి. మనం చూసిన కొన్నింటినే అద్భుతమని చెబితే ఆ పదానికున్న ప్రాముఖ్యత పోతుందేమో.

మొన్న మల్లెం కొండకు పొయి రాత్రి చేసిన అడవి నిద్ర, ఉదయాన్నే దొంగల గుండం దగ్గర బండమింద అలా పడుకుంటే నన్ను నేను మరిచేలా చేసిన కొండ గాలి, తర్వాత అడవిలో అయిదు కిలోమీటర్ల ఒంటరి నడక తాలూకు జ్ఞాపకాలు పూర్తిగా పోకముందే చంద్ర అన్న ఫోన్ “అన్నా ఈ శనివారం ట్రెక్కింగ్ పోదాం వస్తావా” అని. “ఎక్కడన్నా” అని అడిగితే “ఇక్కడే అన్నా వెల్లటూర్ దగ్గర” అని సమాధానం.

పొలతలనా అంటే కాదన్నాడు, వెయ్యి నూతుల కోననా అంటే కాదంట. ఇవి కాకుండా అక్కడేమున్నాయబ్బా అనిపించింది. ఇంతలో అమరావతి నుంచి సందీప్, కడప నుంచి లింగారెడ్డన్న కూడా కాల్ చేశారు “రా వివేక్ కలుద్దాం” అని. సరేలే మనోళ్లను కలిసినట్టుంటుందని వస్తా అన్నాను.

శనివారం అనుకున్న ట్రిప్ కాస్తా ఆదివారానికి మారింది. నిజం చెప్పాలంటే ఈ ట్రిప్ మీద నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఎందుకంటే అవి అంత దట్టమైన కొందలు కాదు, అడవులు కాదూ. అవతల ఇవతల వర్షాచ్చాయ ప్రాంతం కానీ “నేను నాలుగు సార్లు పొయినాన్నా భలే ఉంటుంది” అంటున్న చంద్ర అన్న మాటలు వింటుంటే ఏదో నమ్మకం అంత సులభంగా ఉండే స్థలానికి తొడప్పోడలే అని. అందుకే మామూలుగా వెళ్లా.

బద్వేల్ నుంచి బయల్దేరి కడప చేరుకుని అడవిలో చల్లడానికి విత్తనాలు దొరక్కపోపే నేరేడు పళ్లు కేజీ కొని ఆ విత్తనాలనే చల్లాలనకుంటూ చింతకొమ్మదిన్నె దగ్గరికి చేరుకునేసరికి తొమ్మిదైంది. అక్కడ నుండి అందరం జతయ్యేసరికి మరో అర్థగంట. టమోటాల కోసమని మర్రిచెట్టు కాడ మరి కొద్దిసేపు పిచ్చాపాటి కబుర్లు.

మొత్తంగా పదకొండు గంటలవుతుండగా రెడ్డి పల్లె/శావాస్ ఖాన్ పల్లె దగ్గర కారు పెట్టి బండ్లమింద పొలాల దారిలో మరో మూడు కిలోమీటర్లు. అక్కన్నుంచి కాలి నడక. మొత్తంగా పజ్జెనిమిది మందిమి.

అందరూ తలా ఒకటి తీసికుని నన్ను నా పాటికి వదిలేసినారు. నేను ఆ నేరేడు పళ్లి తింటా వాటెను బూడ్సి నీళ్లు పోసుకుంటా ముందుకు సాగిపొతిమి. రెడ్డి పల్లె చెరువు మొత్తం రేగి చెట్లతో నిండిపోయింది. పిచ్చి చెట్లతో దోవంతా బూడిపోతే అలాగే నడుచుకుంటూ వెళ్లాం.

చెరువు దాటి వెళ్లగానే చిట్టడవి మొదలైంది. దాంతో పాటే రాళ్లు తేలిన కొండవాగు. తొలకర్లకేమో చుట్టూ అడవి కూడా బాగా పచ్చబడింది. కొండలు మరీ దట్టమైనవి కావు గానీ కొండ పేట్లు అందంగా కనిపిస్తున్నాయి.

ఈ అడవుల్ను శేషాచలం ఉప శ్రేణిలో వెయ్యడానికి ఆ కొండ పేటులో పెద్ద పెద్ద బండరాళ్లనో ప్రామాణికంగా తీసుకోవచ్చేమో.

ఏందబ్బా చంద్ర అన్న చూస్తే ఏమో నీళ్లు ఎప్పుడూ పారుతుంటాయి అంటాడి ఇక్కడ చూస్తే ఈ వంకలో నీళ్లు పారి ఎన్ని రోజులైందో అనుకుంటూ అలా నాలుగడుగులు వెయ్యగానే అప్పటి వరకూ అంతర్వాహినిగా ప్రవహించి సందు చిక్కగానే బయటికొచ్చిన కొండ వాగు దర్శనమైంది. నేనూ, వెంకట్, వీరారెడ్డి, శ్రీకాంత్ అక్కడే కూర్చిని రాతి కొలికలు, ఇంగా అక్కడున్న చేపలతో మసాజ్ చేయించుకుంటుండగా మిగతా వాళ్లంతా చాలా దూరం వెళ్లిపోయారు.

అప్పటి వరకూ మాకు కొద్ది దూరంలో కూర్చుని ఉన్న వాళ్లను మా వాళ్లుగా భ్రమపడ్డ మాకు మా వాళ్లు వెళ్లి చాలా సేపయిందని తెలియడంతో అడవి అందాలతో పాటు మేము వెళ్లాల్సిన దారిని కూడా వెతకాల్సి వచ్చింది.

Show comments