Idream media
Idream media
అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న దీక్షకు నేటితో 600 రోజులు. దీక్ష చేస్తున్నది అమరావతి పరిరక్షణ కమిటీ అయినప్పటికీ దాన్ని నడిపిస్తున్నది మాత్రం తెలుగుదేశం పార్టీ అనే విషయం బహిరంగ రహస్యం. వీరికి మద్దతుగా జనసేన , బిజెపి పార్టీలు కూడా తోడు నిలుస్తున్నాయి.
అసలు అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లో రాజధాని ఎక్కడనే ప్రస్తావించక పోయినప్పటికీ నాటి తెలుగుదేశం ప్రభుత్వం
ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజల ఆశలకు గండి కొట్టి అమరావతిని తమ స్వీయ రాజధానిగా ప్రకటించి చారిత్రాత్మక తప్పిదం చేసింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 6 లో భాగంగా రాజధాని పైన ఏర్పాటయిన శివరామకృష్ణన్ కమిషన్ 2014 ఆగస్టు 31 న తన నివేదిక సమర్పించింది. విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయకూడదని ప్రతిపాదించింది. కానీ శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సమర్పించమునుపే
నాటి ప్రభుత్వం 2014 జూలై 21న నాటి పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలోతొమ్మిది మంది పారిశ్రామిక వేత్తలతో కూడిన కమిటీని రాజధానిపై ఏర్పాటు చేసింది.
అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలనే అంతర్గత నిర్ణయం వల్ల నారాయణ కమిటీ కూడా అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయించి 2014 డిసెంబర్ లో తన నివేదికను అందించింది. 2015 అక్టోబర్ 22న అమరావతి రాజధాని శంకుస్థాపన చేశారు.
2019లో ప్రభుత్వం మారిన తర్వాత వైసిపి ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 13న జి ఎన్ రావు నేతృత్వంలో ఐదు మంది సభ్యులతో కూడిన కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ ఈ మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తూ అమరావతి రాజధానిగా కొనసాగిస్తూనే అమరావతి అనుబంధంగా విశాఖపట్నంలోని కర్నూలు లోనూ మరో రెండు రాజధాని ఏర్పాటు చేస్తే ప్రాంతాల మధ్య సమన్వయం ఉంటుందని తెలియజేసింది. జి ఎన్ రావు కమిటీ అభిప్రాయం ప్రకారం వైసీపీ ప్రభుత్వం
2020 జనవరి 21న శాసనసభలో మూడు రాజధానులు (లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి, అడ్మినిస్ర్టేటివ్ రాజధానిగా విశాఖ, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు)
బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.
తెలుగుదేశం పార్టీ కలలుగన్న అమరావతితో పాటు మిగిలిన రెండు ప్రాంతాలకు కూడా సమన్వయం దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అమరావతి ప్రాంత రైతులకు వైసిపి ప్రభుత్వం అన్యాయం చేసినట్లు అపోహలు సృష్టించి వారిని ఉద్యమబాట పడేట్లు చేసింది.
నిజానికి అమరావతి ప్రాంత ప్రజల కడుపు కొట్టింది తెలుగుదేశం పార్టీయే. విభజన చట్టం ప్రకారం ఏర్పడిన శివరామ కృష్ణన్ కమిటీ అభిప్రాయాన్ని కాదని తమ పార్టీ సొంత కమిటీ నారాయణ కమిటీ ద్వారా చెప్పించుకున్న అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయడంలోని అంతరార్థం ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు బహిర్గతమైంది.
మూడు కార్లు పండే 33 వేల ఎకరాల సాగు భూమిని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(CRDA) ద్వారా సేకరించింది. సేకరించిన మొత్తం భూములను అమరావతి బాండ్ల రూపంలో అమ్మకానికి పెట్టి బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) ద్వారా సుమారు 2000 కోట్ల రూపాయలు సేకరించింది.
దేశంలో ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బాండ్లు జారీ చేయడం ఇదే తొలిసారి. రైతుల నుండి రాజధాని పేరుతో భూములు సేకరించిన తెలుగుదేశం ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినది అన్నీ తాత్కాలిక భవనాలే! ఇప్పటికీ రాజధాని ప్రాంత ప్రజలు ఈ విషయమై తెలుగుదేశం పార్టీని నిలదీయ పోవడం ఆశ్చర్యం వేస్తుంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంత రైతుల పై ఆ ప్రాంత అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అమరావతి రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ఆమోదిస్తూనే మిగిలిన రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలను అనుకోవడంలోని అసలు విషయం భవిష్యత్తులో ప్రాంతీయ అసమానతలు లేకుండా చేయడమే.
కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కేవలం తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే అమరావతి రాజధానిగా ప్రకటించి ఆమోదింప చేశారు. ప్రజల నుంచి కారుచౌకగా భూములను కొనుగోలు చేసి వాటిని తిరిగి అధిక రేటు కు సిఆర్ డిఏ కి అమ్మడం చూస్తే దీని వెనకాల తెలుగుదేశం పార్టీ కుట్ర ఇట్టే అర్థమవుతుంది.ఈ విషయం తెలిసి కూడా అమరావతి ప్రజలు అమాయకంగా వారి వలలో చిక్కడం చూస్తే గొర్రె కసాయి వాన్ని నమ్ముతుందన్న సామెత వాస్తవరూపం దాల్చినట్లనిపిస్తుంది.
అమరావతితో పాటు మిగిలిన రెండు ప్రాంతాలలో కూడా రాజధాని ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంటే దీన్ని తెలుగుదేశం పార్టీ
అడ్డుకుంటున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ఆర్థికంగా, భౌగోళికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలలో రాజధాని ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం సమంజసం కాదనేది రాష్ట్ర ప్రజల అభిప్రాయం. ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని, రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలలో ప్రాంతీయ న్యూనతాభావం తొలగిపోతుంది. ఫలితంగా భవిష్యత్తులో ప్రాంతాల వివక్షకు తావివ్వకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది.
దూరదృష్టితో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను అమరావతిలో 600 రోజులుగా ఉద్యమాల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీ కుట్రలను రాష్ట్ర ప్రజలు నిశితంగా చూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అమరావతి రైతులను మోసం చేస్తూ వారిని మిగిలిన ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా చిత్రించింది. ఈ కుట్ర ఉద్యమం పేరుతో విజయవంతం అయినట్టు భావిస్తుంది తెలుగుదేశం పార్టీ.
అమరావతి ప్రాంత రైతులను బాధితులుగా చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను అమరావతిని దోచుకుపోయే దోపిడీ దొంగలుగా చిత్రించి, దీనికంతటికి విలన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ అమరావతి సినిమాకు పెద్ద హీరో తామే అని చెప్పడం కోసం గత 600 రోజులుగా వివిధ ఎపిసోడ్స్ సృష్టించింది తెలుగుదేశం పార్టీ.
అయితే ఈ సినిమాలో అసలు విలన్ ఎవరో? ఆంధ్రప్రదేశ్ అసలు హీరో ఎవరో? నిర్ణయించాల్సింది ప్రేక్షకులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ నిర్మాణంతో పాటు ,కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి తెలుగు దేశం పార్టీ తీసిన “అమరావతి ఉద్యమం” సినిమా స్థానిక సంస్థల ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
రాష్ట్ర ప్రజలు ఎంత నిరాదరించినా తెలుగుదేశం పార్టీ మాత్రం తన ఒంటెద్దు పోకడ మానుకోవడం లేదు. జనాలులేని సినిమాను ఆడించినట్లు ఇంకా అమరావతి ప్రాంత రైతులను మభ్యపెడుతూ రాజధాని ఉద్యమం కొనసాగించడం హాస్యాస్పదం. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరి తో పాటు అమరావతి ప్రాంత రైతులు కూడా అమరావతి తో పాటు మిగిలిన రెండు ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తే తప్పేమిటనేఆత్మ పరిశీలన మొదలైంది.