చిరంజీవి తర్వాత పవన్‌ కళ్యాణ్‌కు అన్నయ్య నేనే: కమెడియన్‌ సుధాకర్‌

చిరంజీవి తర్వాత పవన్‌ కళ్యాణ్‌కు అన్నయ్య నేనే: కమెడియన్‌ సుధాకర్‌

కమెడియన్‌, విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్‌.. ఇలా విభిన్న రకాల పాత్రలతో.. వందలకు పైగా చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సీనియర్‌ నటుడు సుధాకర్‌. తెలుగులో అప్పటి టాప్‌ హీరోలందరి చిత్రాల్లో నటించారు. ‘స్టేట్ రౌడీ’, ‘కొదమ సింహం’, ‘రాజా విక్రమార్క’, ‘పవిత్ర ప్రేమ’, ‘పవిత్ర బంధం’, ‘బొంబాయి ప్రియుడు’, ‘పెళ్లి పందిరి’, ‘సుస్వాగతం’, ‘పెళ్లి చేసుకుందాం’ వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలను ప్రేక్షకులు ఎన్నటికి మర్చిపోలేరు. తన సినీ కెరీర్‌లో వందలకు పైగా చిత్రాల్లో నటించి.. ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్నారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తన కొడుకు కలిసి ఓ న్యూస్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలు మొదలు.. చిరంజీవి, పవన్‌తో తన అనుబంధం, కొడుకును ఇండస్ట్రీలోకి తీసుకువచ్చే అంశాలపై స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు…

కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలు.. చూసి ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు సుధాకర్‌. వీటిపై ఆయన స్పందిస్తూ.. “కొద్ది రోజుల క్రితం నేను చనిపోయానంటూ కొంతమంది పుకార్లు పుట్టించారు. ఆ వార్తలు నన్ను చాలా బాధపెట్టాయి. నేను చాలా బాగున్నాను. పైగా నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టించకండి. ఇలాంటి వార్తల కారణంగా నాతో పాటు నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. నన్ను అభిమానించేవారు.. ఇలా చాలా మంది బాధపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టించడం మంచిది కాదు’’ అన్నారు.

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సుధాకర్‌. చిరంజీవి ఇప్పటికీ తనను చాలా ఇష్టపడతారని.. ఏ అవసరం వచ్చినా కాల్ చేసినా.. వెంటనే స్పందిస్తారని వెల్లడించారు. “సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో చిరంజీవి, నేను ఒకే రూములో ఉండేవాళ్లం. అప్పడు మొదలైన మా స్నేహం నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మా మధ్య చిన్న గొడవ కూడా రాలేదు. ‘యముడికి మొగుడు’ సినిమాలో నేను నటించాల్సిందేనని చిరంజీవి పట్టు బట్టారు. ఆయన కోరిక మేరకు నేను ఆ సినిమాలో నటించాను. ఈ చిత్రంతో నాకు మంచి పేరు వచ్చింది.

‘‘ఇక చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. మేమిద్దరం సుస్వాగతం సినిమాలో నటించాం. చిరంజీవి తర్వాత పవన్‌కు నేనే అన్నయ్య. ఇక నాకు తమిళ సినిమాల కంటే తెలుగులో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అందుకే, హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాను. నా కొడుకు బిన్నీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి ఆశీర్వాదాలను వాడికి ఉన్నాయి’’అని చెప్పుకొచ్చారు.

Show comments