iDreamPost
android-app
ios-app

చాట్‌లో ఎమోజీలు వాడుతున్నారా? జాగ్రత్త మరి!

చాట్‌లో ఎమోజీలు వాడుతున్నారా? జాగ్రత్త మరి!

వాట్సాప్‌ కావచ్చు.. ఇతర సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫాంలు కావచ్చు.. చాటింగ్‌ చేసేటప్పుడు మన ఎక్స్‌ప్రెషన్స్‌ను అవతలివారికి అర్థమయ్యేలా చిన్న బొమ్మ రూపంలో చెప్పటానికి నూటికి 99 శాతం మంది ఎమోజీలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, ఒక్కో సారి అదే మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లో పడేయవచ్చు. జైలు పాలుకూడా చేయవచ్చు. ఇందుకు కెనడాలో జరిగిన ఓ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఘటనలో రైతు వాడిన ఓ థమ్సప్‌ ఎమోజీ అతడి కొంప ముంచింది. లీగల్‌ కేసులో పడేసి.. ఏకంగా 60 లక్షల రూపాయలు నష్టపోయేలా చేసింది.

ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. కెనడాలోని సస్కట్‌ చేవాన్‌కు చెందిన క్రిష్‌ ఆచ్‌టర్‌ అనే రైతు పెద్ద మొత్తంలో ఉలవలు పండిస్తూ ఉంటాడు. ఓ రోజు అదే ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ ఆచ్‌టర్‌ దగ్గర ఉన్న ఉలవలు కొనడానికి బేరం కుదుర్చుకున్నాడు. మొత్తం 86 టన్నుల ఉలవలకు రేటుతో సహా బేరం చేసుకున్నాడు. ఆచ్‌టర్‌ కూడా ఓకే అని అ‍న్నాడు. సదరు కాంట్రాక్టర్‌ ఇందుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ పేపర్ల ఫొటోను నవంబర్‌ నెలలో ఆచ్‌టర్‌కు స్నాప్‌చాట్‌లో పంపాడు. ఆ కాంట్రాక్ట్‌ను సరిగా చదవమని.. ఏదైనా సమస్య ఉంటే చెప్పమని అన్నాడు.

స్నాప్‌చాట్‌కు వచ్చిన మెసేజ్‌కు ఆచ్‌టర్‌ థమ్సప్‌ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. థమ్సప్‌ ఎమోజీ రిప్లైని కాంట్రాక్టర్‌ ఇంకోలా అర్థం చేసుకున్నాడు. ఆచ్‌టర్‌ తన అంగ్రిమెంట్‌కు ఒప్పుకున్నాడని భావించాడు. అయితే, నెలలు గడుస్తున్నా ఆచ్‌టర్‌ కాంట్రాక్టర్‌కు ఉలవలు సప్లై చేయలేదు. దీంతో అతడు ఆచ్‌టర్‌కు ఫోన్‌ చేసి.. ఎందుకు ఉలవలు పంపలేదని అడిగాడు. అప్పుడు ఆ ఆచ్‌టర్‌ ‘‘ నేను నీతో ఎలాంటి కాంట్రాక్ట్ చేసుకోలేదు. నువ్వు పంపిన ఫొటో నాకు అందింది అని చెప్పడానికి మాత్రమే నేను థమ్సప్‌ ఎమోజీ పెట్టాను’’ అని అన్నాడు.

దీంతో కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించాడు. ఆచ్‌టర్‌ తనను మోసం చేశాడు అంటూ కేసు వేశాడు. ఈ కేసుపై కోర్టు తాజాగా విచారణ జరిపింది. ఆచ్‌టర్‌.. కాంట్రాక్టర్‌కు చెప్పిందే కోర్టులో జడ్జిముందు కూడా చెప్పాడు. అయితే, జడ్జి ఆచ్‌టర్‌ మాటలతో ఏకీభవించలేదు. కొన్ని విషయాల్లో సంతకం చేసే పనిని ఎమోజీలే చేస్తాయని ఆయన పేర్కొన్నాడు. ఎమోజీలు కొన్ని సందర్బాల్లో సంతకంగా.. అంగీకారంగా మారతాయని చెప్పాడు. కాంట్రాక్ట్‌ను బ్రేక్‌ చేసినందుకు 60 లక్షల రూపాయలు ఫైన్‌ వేశాడు. మరి, మీరు కూడా ఇష్టం వచ్చినట్లు ఎమోజీలను వాడుతున్నట్లు అయితే జాగ్రత్త.