iDreamPost
android-app
ios-app

నాయకుడు సినిమా రివ్యూ!

నాయకుడు సినిమా రివ్యూ!

సమాజంలో పేరుకుపోయిన కొన్ని కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు 21వ శతాబ్ధంలోనూ ఇంకా అలానే ఉన్నాయి. ముఖ్యంగా కుల,మత విషయాలు కొన్ని రాష్ట్రాల్లో చాలా దారుణమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి. సినిమాల ద్వారా ఈ సమస్యలను ఎత్తి చూపటంలో.. వాటిని చీల్చి చండాడటంలో తమిళ దర్శకులు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వారిలో మారీ సెల్వరాజ్‌ ఒకరు. ఆయన ఎక్కువగా ప్రజా సమస్యలపై సినిమాలు చేస్తూ ఉంటారు. తాజాగా, మామన్నన్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తమిళ నాట విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక, తెలుగులో ‘నాయకుడు’పేరుతో డబ్‌ అయి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ప్రజా సమస్యలను ఎత్తి చూపిస్తూ తీసిన ఈ సినిమా జనాల్ని ఏ మేరకు మెప్పించింది. సినిమా హిట్టా? ఫట్లా?

కథ :

రఘువీరా (ఉదయనిధి స్టాలిన్), లీల (కీర్తి సురేష్) కాలేజీ చదువుకునే రోజుల్లో క్లాస్‌మేట్స్‌. వీరిద్దరికీ ఒకరంటే ఒకరి ఇష్టం ఉన్నా.. పెద్దగా మాట్లాడుకోరు. కాలేజీ అయిపోయిన తర్వాత ఎవరి కల కోసం వాళ్లు పని చేసుకుంటూ ఉంటారు. రఘువీరా ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా మారతాడు. లీల పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తుంది. అయితే, ఈ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టడం కొంతమందికి ఇష్టం ఉండదు. అందుకే.. రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి)లకు ఇష్టం ఉండదు. అన్ని రకాలుగా ఇన్‌స్టిట్యూషన్‌ను ఇబ్బంది పెడతారు. ఈ నేపథ్యంలోనే లీల ఇన్‌స్టిట్యూట్ బిల్డింగ్ కోసం రఘువీరా తండ్రి తిమ్మరాజు (వడివేలు) దగ్గరకు వస్తారు.

తిమ్మరాజు రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావటంతో అతడ వల్ల తనకు సాయం అందుతుందని లీల భావిస్తుంది. అప్పుడు రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇన్‌స్టిట్యూట్ కోసం ఇచ్చేస్తాడు. ఓ రోజు రత్నవేలు మనుషులు ఇన్‌స్టిట్యూషన్‌ మీద దాడి చేస్తారు. బిల్డింగ్‌ను మొత్తం ధ్వంసం చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న రఘవీరా, తిమ్మరాజు రత్నవేలును నిలదీస్తారు. ఇక, అప్పుడు అసలు కథ మొదలవుతుంది. రత్నవేలు, రత్నవేలు అన్న నేరుగానే రఘువీరా, తిమ్మరాజులపై దాడులు చేయటం మొదలుపెడతారు. చివరకు అది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? లీల కల నెరవేరిందా? లేదా? అన్నది అసలు కథ.

విశ్లేషణ :

మారీ సెల్వరాజ్‌ తన సినిమాల ద్వారా కుల సమస్యలపై ఎక్కువగా పోరాడుతూ ఉంటారు. నాయకుడు సినిమాలోనూ అదే చేశారు. మారీ సెల్వరాజ్‌ సినిమాల్లో కథకంటే.. కథనానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దర్శకుడు తను చెప్పాలనుకున్నది సీన్ల ద్వారా, షాట్ల ద్వారా చెప్పేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో హీరో, విలన్‌ పాత్రలను కూడా అద్భుతంగా ఎస్టాబ్లిస్‌ చేశాడు. హీరో ప్రేమకు, విలన్‌ క్రూరత్వానికి తేడాను అద్భుతంగా చూపించాడు. ప్రథమ భాగంలో పాత్రల పరిచయం గురించే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రెండవ భాగంలో అసలు కథ మొదలవుతుంది. పరిస్థితులకు తగ్గట్టు మనిషి ఎలా మారతాడు అన్నది చాలా చక్కగా చూపించాడు.

డైలాగులు వంద భావాలను, అర్థాలను చెప్పకనే చెబుతాయి. రెండవ భాగంలో హీరో, విలన్‌ మధ్య సంభాషణ గుర్తుండిపోతుంది.  ‘ఆయన కూర్చోలేదు సరే మీరు ఎందుకు కూర్చోమనలేదు?’ అని ఉదయ నిధి ఫాహద్‌ ఫాజిల్‌ను అడగ్గా.. ‘నిన్ను కూర్చోనివ్వకపోవడం నా అధికారం. నీ కొడుకుని కూర్చోమనడం నా రాజకీయం’ అని ఫాహద్‌ ఫాజిల్‌.. ఉదయ నిధి స్టాలిన్‌కు అద్భుతమైన కౌంటర్‌ ఇస్తాడు. ఇలా సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా సాగుతుంది. ఇక, ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ మనల్ని కళ్లు పక్కకు తిప్పనివ్వకుండా చేస్తుంది. నిర్మాణ విలువల విషయానికి వస్తే.. అన్ని విషయాల్లోనూ ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు నిర్మాత ఉదయ నిధి స్టాలిన్. అందుకే ఓ మంచి అవుట్‌పుట్‌ వచ్చింది.

ఎవరెవరు ఎలా చేశారంటే..

సినిమా జరుగుతున్నంత సేపు స్క్రీన్‌ మీద నటీనటుల కంటే.. పాత్రలే కనిపిస్తాయి. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించారు. వారి వారి పాత్రలో జీవించారు. ముఖ్యంగా వడివేలు నటన గురించి చెప్పుకోవాలి. చాలా ఏళ్ల తర్వాత ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఇప్పటివరకు కామెడీకి మాత్రమే పరిమితమైన ఆయనలో ఈ కోణం ఉందని కూడా ఊహించి ఉండం. అంత అద్భుతంగా నటించారు. తమిళనాడు ఆయన నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందాయి. సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సైతం పొగిడారు. ఇక, ఉదయనిధి స్టాలిన్‌ కూడా అద్భుతంగా నటించారు. ఇక, విలన్‌ పాత్రలో ఫాహద్‌ ఫాజిల్‌ నటన మనల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. లీల పాత్రలో కీర్తి సురేష్‌ కూడా చాలా చక్కగా నటించారు. మిగిలిన పాత్రధారులు కూడా తమ పరిధికి తగ్గట్టు నటించారు.

ప్లస్ లు:

  • స్టోరీ లైన్
  • నటీ,నటుల నటన
  • మ్యూజిక్

చివరి మాట : నాయుకుడు మిమ్మల్ని మెప్పిస్తాడు!

రేటింగ్: 3.5/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)