iDreamPost
iDreamPost
ఏంటో థియేటర్ కు ఓటిటికి మధ్య దూరం రోజుల నుంచి ఏకంగా గంటల్లోకి మారిపోయే రోజులు వచ్చేలా ఉన్నాయి. డిజిటల్ విప్లవం మరీ ఈ స్థాయిలో ఉంటుందనేది ఎవరూ ఊహించనిది. దీనికి లాక్ డౌన్ కారణమా లేక మరొకటా అనేది చెప్పలేం కానీ మొత్తానికి నిర్మాతలు తమ సినిమాను ప్రేక్షకులకు చేరవేయడానికి పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. హాలు దాకా జనాన్ని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొన్ని వినూత్నంగా ఉంటే మరికొన్ని విచిత్రంగా ఉన్నాయి. ఇదంతా తెలిసే చేస్తున్నారా లేక తప్పుడు అంచనాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారా అంతు చిక్కడం లేదు. ఇక్కడ చెప్పిన సినిమా తిరుగులేని గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మొన్న శుక్రవారం 12న ఉప్పెనతో పాటు ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ FCUK విడుదలైన సంగతి తెలిసిందే. పబ్లిసిటీ చేశారు కానీ జనానికి పెద్దగా చేరలేదు. దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. జగపతిబాబు లాంటి ఇమేజ్ ఉన్న నటుడు చేసినా ప్రయోజనం కనిపించలేదు. అనధికార ట్రేడ్ సమాచారం మేరకు పట్టుమని పది లక్షల షేర్ కూడా రాలేదని తెలిసింది. చాలా చోట్ల జీరో షేర్ కూడా నమోదయ్యిందట. ఫ్యామిలీ ఆడియన్స్ అనుమానించే టైటిల్ పెట్టడం. అసలు కంటెంట్ లో బూతులు, అర్థం లేని ఎపిసోడ్లు ఎక్కువ ఉండటం లాంటి కారణాలన్నీ బాగా నెగటివ్ రిపోర్ట్స్ రావడానికి దోహదపడ్డాయి.
దీంతో కాస్త వెరైటీగా పబ్లిసిటీ చేద్దామని నిర్ణయించుకున్న నిర్మాతలు 24 గంటల పాటు మొత్తం సినిమాను యూట్యూబ్ లో నిన్న సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచేశారు. ఎందుకయ్యా అంటే ఇలా చూసినవారు మరికొందరికి చెప్పి థియేటర్ కు వెళ్లేలా ప్రోత్సహిస్తారని. వినడానికే నవ్వొచ్చేలా ఉంది కదూ. అయినా ఏ అరగంట సినిమా పెట్టి ప్రచారం చేసుకుంటే ఒక రకం కానీ మొత్తం 2 గంటల 50 నిమిషాలను అప్లోడ్ చేసి దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఈ మాత్రం దానికి అంతకష్టపడి ఖర్చులు భరించి థియేటర్ రిలీజ్ చేయడం ఎందుకు. నేరుగా ఓటిటికి ఇచ్చేసి ఉంటే కనీసం పరువైనా దక్కేది కదా