iDreamPost
iDreamPost
ఏడేళ్ల క్రితం దేశానికి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్రమోడీకి అంతా అనుకున్నట్టుగానే సాగిపోయింది. తొలి ఐదేళ్లలో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజలు ఆయనకు మద్ధతు పలికారు. చివరకు నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపాయన్నది పక్కన పెడితే సామాన్య ప్రజల్లో ఆయన బలం పెరుగుతూనే ఉంది. దానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. తిరుగులేని ఆధిక్యం సాధించిన తర్వాత రెండో సారి గద్దెనెక్కిన తొలి ఏడాదిలో అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. కశ్మీర్ రాష్ట్ర హోదా రద్దు, 370 ఆర్టికల్ తొలగించడం వంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగానే అంతర్జాతీయంగానూ మోడీ బలమైన నేత అనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో సీఏఏ పేరుతో చేసిన ప్రయత్నాలు పెద్ద వివాదానికి అవకాశం ఇచ్చాయి. దాంతో ఏడాది కాలంగా మోడీ ప్రభుత్వ తీరు మీద వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది.
సీఏఏ, ఎన్పీఆర్ చట్టాల కారణంగా మైనార్టీలలో తీవ్ర ఆందోళన కనిపించింది. దేశవ్యాప్తంగా ఉధృతంగా ఉద్యమం సాగింది. ఢిల్లీలో పెద్ద స్థాయిలో మత ఘర్షణలు కూడా జరిగి రాజధాని రణరంగం అయ్యింది. కరోనా వ్యాప్తితో ఆ ఉద్యమం చల్లారిపోయినా తాజాగా రైతులు రోడ్డెక్కి నెలల తరబడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. పలు ఆటంకాలు, ప్రభుత్వ అణచివేత ఉన్నప్పటికీ వెనకడుగు వేయడం లేదు. చివరకు గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై జరిగిన పరిణామాలతో రైతులు కొంత రక్షణలో పడినప్పటికీ మళ్లీ వెంటనే రెట్టించిన ఉధృతితో పుంజుకుని పోరు తీవ్రం చేశారు. ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. మోడీ-షా ద్వయం మొదటిసారి సవాల్ ఎదుర్కుంటున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ ఉద్యమం ఎలాంటి పరిణామాలు దారితీస్తుందోననే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పటికే పంజాబ్ నుంచి హర్యానా, యూపీ, రాజస్తాన్ వంటి రాష్ట్రాలకు కూడా విస్తరించిన తరుణంలో బీజేపీకి ఆయుపట్టు లాంటి ప్రాంతంలో దాని తాకిడి తీవ్ర చర్చకు దారితీస్తోంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా బీజేపీకి గట్టి మద్ధతుదారులుగా ఉన్న సెక్షన్లలో కూడా వ్యతిరేకతకు కారణం అవుతోంది. అగ్రిసెస్ పేరుతో పెట్రో భారం మరింతగా మోపేందుకు సిద్ధం కావడంంతో కేంద్రం తీరు మీద అనేక మంది మండిపడుతున్నారు. మధ్య తరగతికి పన్ను రాయితీలు ఇస్తారని ఆశిస్తే, అందుకు భిన్నంగా కేవలం 75సం.లు వయసు పైబడిన వారికి రిటర్నులు తప్పనిసరి కాదని మాత్రమే చెప్పడంతో పలువురు రగిలిపోతున్నారు. కరోనా అనంతరం భారీగా రాయితీలు ఉంటాయని ఆశించిన వేతనజీవులకు పీఎఫ్ వడ్డీ మీద కూడా పన్నులు వేయడం పట్టరాని ఆగ్రహానికి కారణం అవుతోంది. దాంతో బీజేపీకి గట్టి పట్టున్న పట్టణ మధ్య తరగతి వర్గంలో బడ్జెట్ పట్ల నిరసన కనిపిస్తోంది. నేరుగా ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా బడ్జెట్ లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దాని తాకిడి స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ పరిణామాలతో ఇటీవల బీజేపీకి కొంత క్లిష్ట పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు రైతుల ఉద్యమానికి పోలీసులు సైతం మద్ధతు పలికే పరిస్థితి ఏర్పడడం, మరోవైపు బడ్జెట్ పట్ల వేతనజీవుల్లో నైరాశ్యం కలిసి బీజేపీ బలంగా కనిపించే సోషల్ మీడియాలో కొంత సతమతం కావాల్సి వస్తోంది. చివరకు ప్రధానమంత్రి వీడియోలకే అన్ లైకుల వెల్లువ కనిపిస్తోంది. బీజేపీ అఫీషియల్ చానెల్లో గానీ, డీడీ న్యూస్ చానెల్లో గానీ మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలకు గతంలో ప్రధాని ఏం చెప్పినా లైకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిది. డిజ్ లైకులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. లైకులతో పోలిస్తే అనేక రెట్లు అధికం అవుతున్నాయి. ఈ పరిణామాలతో బీజేపీ క్యాంపులో కూడా కొత్త చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. పరిస్థితులు చూస్తుంటే 2011 నాటి యూపీఏ 2 ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం అవుతున్నాయా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఆ తర్వాత అది క్రమంగా అసంతృప్తి వ్యతిరేకతగా మారి 2014 నాటి ప్రభుత్వం మారడానికి కారణమయ్యింది. నిజానికి 2011 నాటికి బీజేపీకి కూడా తగిన నాయకత్వం లేకపోయినా 2014 నాటికి మోడీ బలంగా దూసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే చరిత్ర ఉత్పన్నం కాకుండా చూసుకునేందుకు బీజేపీ థింక్ ట్యాంక్ తీవ్రంగా మథనం చేయాల్సి ఉంది.