iDreamPost
android-app
ios-app

అట్లాస్ సైకిల్ కంపినీ మూసివేత

అట్లాస్ సైకిల్ కంపినీ మూసివేత

ఒకప్పుడు అది మధ్య తరగతి నేస్తం…
ఇప్పుడు కొందరికి వ్యాయామం..
పెట్రోలు తో పని లేదు…
పైసలెక్కువ అక్కర్లేదు..
అదే సైకిల్ ప్రయాణం… అంటూ ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ప్రేమికులు మెసేజెస్ పంపుతున్న రోజే.. ఓ ప్రముఖ సైకిల్ కంపెనీ ఉద్యోగులకు కూడా మెసేజ్ పంపింది. శుభాకాంక్షలు చెబుతూ కాదు.. కంపెనీ మూసేస్తున్నం ఇక ఉద్యోగానికి రావద్దని. అదే అట్లాస్ సైకిల్స్. కరోనా క్రైసిస్.. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అట్లాస్ సైకి ల్స్ లిమిటెడ్ ఉత్తర్ ప్రదేశ్ సాహిబాబాద్ లోని కంపెనీ ఉద్యోగులకు తాత్కాలికంగా “లే ఆఫ్” ప్రకటిస్తూ నోటీస్ ఇచ్చింది.

ఎన్నో దశాబ్దాల చరిత్ర అట్లాస్ సొంతం. ఎంతో మంది ప్రముఖులు కూడా చిన్న తనంలో ఆ సైకిల్ తొక్కినోళ్లే. 1951లో అట్లాస్ మానుఫ్యాక్చరింగ్ ప్రారంభమైంది. 1965 నాటికి సైకిల్ తయారీలో అతిపెద్ద కంపెనీ గా పేరొందింది. 600 స్టోర్ లతో.. 14 రాష్ట్రాల్లో విస్తరించింది. ఏటా నాలుగు మిలియన్ ల సైకిళ్లను ఉత్పత్తి చేసేది.1978లో ఫస్ట్ రేసింగ్ సైకిల్ ను ఇండియాకు తీసుకొచ్చింది కూడా ఈ కంపెనీయే. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

కొద్ది సంవత్సరాలుగా సైకిల్ కొనుగోళ్లు చేసే వాళ్ళు తగ్గి పోవడం… మోటారు వాహనాల వినియోగం పెరగడంతో సైకిళ్ళ ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చింది కంపెనీ. క్రమంగా రెండు యూనిట్లను మూసేసింది. మధ్యప్రదేశ్ లోని యూనిట్ ను 2014 లో, సొనపేట లోని యూనిట్ ను 2018లో మూసేసింది. ఇప్పుడు తాజాగా ఈ నెల మూడున సాహిబాబాద్ లోని యూనిట్ ను కూడా మూసేసింది. దీంతో సుమారు 1000 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. లాక్ డౌన్ సడలింపుల అనంతరం మమ్మల్ని ఉద్యోగానికి రమ్మన్నారు అని.. రెండు రోజులుగా డ్యూటీ చేశామని, ఇప్పుడు అకస్మాత్తుగా నోటీస్ ఇచ్చారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కర్మాగారం లో నెలకు సుమారు రెండు లక్షల సైకిళ్లు ఉత్పత్తి చేసేవారిమని కార్మికులు తెలిపారు.

” కరోనా పరిస్థితుల్లో కంపెనీ చాలా ఆర్థిక నష్టాల్లో ఉంది. ముడి సరుకు కూడా కొన లేకపో తున్నాం. పరిస్థితులు చక్కదిద్దే వరకూ తాత్కాలికంగా మోసేస్తున్నామ్” అని కంపెనీ నోటీస్ లో పేర్కొంది. తాత్కాలికంగా అంటే ఎన్నాళ్ళో స్పష్టత లేదు. గతంలోనూ కొన్ని యూనిట్లను కంపెనీ మూసేసింది. ప్రస్తుతం మూత పడింది అట్లాస్ కంపెనీకి చెందిన ఆఖరి యూనిట్. ఈ వార్త చాలా మంది సైకిల్ ప్రేమికులనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని సైకిల్ కార్మికులను కూడా ఆవేదనకు గురి చేసింది. అట్లాస్ అంటే ఒక బ్రాండ్ గా ఉండేదని, తన దుకాణానికి ఆ సైకిల్లే ఎక్కువగా రిపేర్ కు వచ్చేవని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన సైకిల్ కార్మికుడు సోమేశ్వర రావు తెలిపారు. ఈ కరోనా క్రైసిస్ మున్ముందు ఇంకెన్ని కంపెనీలపై ప్రభావం చూపు తుందో..! ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేస్తుందో..!!