తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అక్రమాస్తుల కేసులో శిక్షపడి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ నటరాజన్ (చిన్నమ్మ) త్వరలోనే విడుదల కానున్నారనే ప్రచారం సాగుతోంది. జయ లలితతోపాటు శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో కొంతకాలం విచారణ ఖైదీగా శిక్ష అనుభవించారు. ఆ తరువాత జయలలిత మృతి చెందారు.
అక్రమాస్తుల కేసులో తుది తీర్పురావడం, దోషిగా నిర్ధారణ కావడంతో శశికళ పరప్పన జైలులో గడుపుతున్నారు. అయితే, ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రభుత్వాలు ఆగస్టు 15కు ముందే విముక్తి కలిగిస్తున్నాయి. తాజాగా కర్ణాటక జైళ్ల శాఖ సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను రూపొందించే పనిలో ఉంది. ప్రస్తుతానికి ఈ జాబితాలో శశికళ పేరు లేదని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, రాజకీయ వర్గాలు మాత్రం ఈ జాబితా తుదిరూపు సంతరించుకునే సరికి ఆమె పేరు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నాయి.
చిన్నమ్మ త్వరలోనే బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగష్టు 14న శశికళను జైలు అధికారులు విడుదల చేయబోతున్నట్లు తమిళనాడుకు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు డాక్టర్ ఆశీర్వాదం ట్వీట్ చేశారు. దీంతో తమిళ రాజకీయాల్లో కుదుపు మొదలైంది.
వచ్చే ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, శశికళ విడుదల సమాచారాన్ని బిజెపి నాయకుడు వెల్లడించడంతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అది కూడా ఆమె విడుదలవుతున్నారనే సమాచారాన్ని బిజెపి నాయకుడు వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఏడాది ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గడువు కంటే ముందే ఆమెను విడుదల చేస్తున్నారని చెబుతున్నారు. ఈ దిశగా కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చిందనేది హాట్ టాపిక్.
2016 నాటి ఎన్నికల్లో జయలలిత సారథ్యంలోని అన్నా డీఎంకే ఘర విజయం సాధించింది. వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని హస్తగతం చేసుకుంది. ముఖ్యమంత్రిగా జయలలిత వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎక్కువకాలం జీవించలేకపోయారు. అనారోగ్యానికి గురైన ఆమె చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే ఏడాది డిసెంబర్‌లో కన్నుమూశారు. ఆ వెంటనే పన్నీర్ సెల్వంన్ని ముఖ్యమంత్రిని చేసింది. తరువాత కొన్ని రోజులకు పన్నీర్ సెల్వం ఏకుమేకై…రెబల్ గా మారి పదవిని వదిలేందుకు ససేమీరా అన్నారు. అయితే ఎమ్మెల్యేలంతా శశికళ వైపు ఉండటంతో కొద్దిరోజుల తరువాత శశికళ సిఎంగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయి.
అక్రమాస్తుల కేసులో దోషులుగా తేలడంతో.. శశికళ సహా ఇళవరసి, సుధాకరన్‌లకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. 2017 ఫిబ్రవరిలో ఆమెతో పాటు ఇతరులు జైలుపాలు అయ్యారు. దాంతో సిఎంగా పలనీ స్వామిని ఆమె చేశారు. అయితే తరువాత బిజెపి, మోడీ ఆశీస్సులతో పలనీ స్వామి, పన్నీర్ సెల్వం కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో అన్నా డిఎంకె.. బిజెపికి చేరువ అయింది. ప్రస్తుతం వీరి నేతృత్వంలోనే తమిళనాట ప్రభుత్వం నడుస్తోంది. ఇక ఇప్పుడు చిన్నమ్మ మళ్లీ వస్తే తమిళనాట రాజకీయాల్లో కీలక మార్పులు జరగడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీ ఆమె విడుదల అవుతారంటూ బిజెపి నాయకుడు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంకా శిక్షాకాలం మిగిలే ఉన్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆమెను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.