ప్రొఫెషనల్‌గా చెప్పాలంటే కథలో 3 భాగాలుంటాయి.
(1) బిగినింగ్ (2) మిడిల్ (3) ఎండ్
అంటే 80 సీన్లు సినిమాలో ఉన్నాయనుకుంటే బిగినింగ్ 20 సీన్స్, మిడిల్ 40 సీన్స్ , ఎండ్ లేదా క్లైమాక్స్ 20 సీన్స్ ఉండాలి.
కథని ప్రారంభించడం ఎలా? ఇదేం పెద్ద కష్టం కాదు. పాత కాలం సాంప్రదాయిక పద్ధతుల్లో చెప్పాలంటే హీరో పరిచయం. కథ అవసరాన్ని బట్టి కొన్ని సినిమాలు చైల్డ్హుడ్తో ప్రారంభమవుతాయి. దేవదాసులో చిన్నప్పటి ప్రేమ ముఖ్యం కాబట్టి ఆ ఎపిసోడ్ చాలా సేపు నడుస్తుంది. మల్లీశ్వరి సేమ్ జానర్. మాయాబజార్ కూడా శశిరేఖ, అభిమన్యుల కథే కాబట్టి చిన్నప్పటి సీన్స్ మస్ట్.
థియేటర్లో కూచున్నంత సేపు ప్రేక్షకుడు ఈ లోకం మరిచిపోవాలి. అది మంచి సినిమా కింద లెక్క. ఆ రోజుల్లో సినిమా తప్ప వేరే వినోదం లేదు. ఓపిగ్గా చూసేవాళ్లు. ఇప్పుడు చేతిలో సెల్‌ఫోన్ ఉంది. కొంచెం బోర్ కొడితే వాట్సప్, ఫేస్బుక్ల్లోకి జారుకుంటారు. ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించడం కష్టమైతే, 2 గంటలకి పైగా కూచోపెట్టడం ఇంకో కష్టం. అందుకని అనవసరంగా చైల్డ్ ఎపిసోడ్స్ జోలికెళితే డిస్కనెక్ట్ అయిపోతారు. మహానటిలో చైల్డ్ ఎపిసోడ్ బాగుంటుంది. కథలోకి మనల్ని ఆసక్తిగా తీసుకెళ్లిన తర్వాత రావడంతో సాగదీత లేదు. అదే హలో సినిమాలో కథకి చైల్డ్ ఎపిసోడ్ చాలా ముఖ్యమే అయినా డోస్ ఎక్కువై పోయింది. రెడ్‌లో క్లైమాక్స్‌లో వచ్చిన చైల్డ్ ఎపిసోడ్ హింసిస్తుంది.
హీరో బాల్యంతో పనిలేదనుకుంటే డైరెక్ట్ ఎంట్రీనే. కమర్షియల్ సినిమాల్లో అయితే హీరో ఎవరితోనో ఫైట్ చేస్తాడు. తర్వాత తన క్యారెక్టర్ని వివరిస్తూ తనని తాను సింహం , పులి అంటూ పాట పాడుతాడు. రజనీ చాలా సినిమాల్లో ఎంట్రీనే పాటతో ఉంటుంది (ముత్తు, నరసింహ). చిరంజీవి అయితే ఒక రేంజ్ ఫైట్ చేసి బంగారు కోడిపెట్ట అని పాడుతాడు.
కేవీ.రెడ్డి పద్ధతి వేరు. కథని చాలా సరళంగా చందమామ కథలా చెబుతాడు. పాతాళభైరవి (1951) మొదటి షాటే NTR మీద Open అవుతుంది. తోటరాముడు రాజకుమారి ప్రేమలో పడడానికి 10 నిమిషాలకి మించి పట్టదు. ఆ అమ్మాయి ప్రేమించడానికి ఇంకో 10 నిమిషాలు. వాళ్ల మధ్య అంతస్తుల తేడా ఉందని ధనం సంపాదిస్తే తప్ప ప్రేమ ఫలించదని తెలుసుకోడానికి, పాటలు పాడుకోడానికి అరగంట. విలన్ ఎంట్రీ అంతా మొదటి గంటలోనే. మిగిలిన 2 గంటల్లో ఒకటిన్నర గంట హీరోకి కష్టాలు, సంఘర్షణ, చివరి అరగంట క్లైమాక్స్, విలన్ అంతం.
కొద్దోగొప్పో తేడాతో అన్ని కమర్షియల్ సినిమాల ఫార్ములా ఇదే. అప్పట్లో 3 గంటల నిడివి, 10 పాటలకి అవకాశం ఉండేది. ఇపుడు 2 లేదా 2.30 గంటలు, నాలుగైదు పాటలు. మొదటి 25 నిమిషాల్లోనే కథ ఎటువైపు వెళుతుందో తెలిసిపోవాలి. విలన్ ఎస్టాబ్లిష్ కావాలి. ఇద్దరి మధ్య గొడవ వుంటే 40 నిమిషాల్లో తేలిపోవాలి. ఈ మధ్య మాస్టర్ సినిమా వచ్చింది. విజయ్ హీరో, విజయ్‌సేతుపతి విలన్. ఖైదీ లాంటి మంచి సినిమా తీసిన లోకేశ్ కనకరాజ్ డైరెక్టర్. హీరో , విలన్ బిల్డప్ సీన్లకే గంట సినిమా పోయింది. వాళ్లిద్దరు ఎపుడు ఎదురవుతారా అనే ఉత్కంఠకి అవకాశమే లేకుండా పోయింది. సెకెండాఫ్ చివరి అరగంట సంఘర్షణ. అది కూడా మామూలు ఫార్ములా ఫైటింగ్‌తో. 3 గంటల సినిమా హింసించింది. హీరో చేతిలో దెబ్బలు తినడమే పాయింట్ అయితే దానికి విజయ్‌సేతుపతి లాంటి మంచి నటుడు అవసరం లేదు.
కొన్ని కథల్లో విలన్ ఉండడు. పరిస్థితులే విలన్. The Climb (ఫ్రెంచి) సినిమాలో హీరోహీరోయిన్ ప్రేమించుకుంటారు. నీ కోసం ఏమైనా చేస్తా అంటాడు హీరో. అయితే ఎవరెస్ట్ ఎక్కుతావా అంటుంది హీరోయిన్. ఆ కుర్రాడికి ఎవరెస్ట్ ఎక్కడుందో కూడా తెలియదు. ఆమె ప్రేమ కోసం బయల్దేరుతాడు. మంచు కొండల్లోని పరిస్థితులే విలన్. ఎవడే సుబ్రమణ్యంలో విలన్ ఉండడు. దూద్ కాశీకి వెళ్లడంలోని కష్టమే విలన్. సాహోలో ఎవరు విలన్, ఎవరు కాదో గుర్తు పట్టలేనంత మంది ఉంటారు.
ఇంగ్లీష్ సినిమాల్లో హీరో బిల్డప్, పాటలు, నాలుగు కామెడీ సీన్స్ ఉండవు కాబట్టి, స్క్రిప్ట్ పక్కాగా తూకం వేసినట్టు ఉంటుంది. ప్రిడేటర్ (1981) గమనించండి. 107 నిముషాల సినిమా మనల్ని తలతిప్పనివ్వదు. మొదటి 15 నిముషాల్లోనే కథలోకి Entry. క్లైమాక్స్ వరకూ హీరో టీంకి , ఎలియన్కి మధ్య జరిగిన యుద్ధం.
కథని ఎన్ని రకాలుగా అయినా Open చేయొచ్చు. అది మనిష్టం. “తలకి తుపాకులు గురి పెట్టి మీట నొక్కబోతున్నప్పుడు అతనికి తన గతమంతా గుర్తొచ్చింది”… ఒక మెక్సికన్ రచయిత నవలలోని తొలి వాక్యం ఇది.
నాని నేను లోకల్లో Opening Scene ఇదే.
రామాయణం అంటే రావణుడు ఉండాలి. ఆ కథని యుద్ధరంగంలో మరణానికి సిద్ధంగా ఉన్న రావణుడి ప్లాష్‌బ్యాక్‌లో చెబితే
అది ఆనంద్ నీలకంఠన్ నవల “అసురుడు”.
కథని మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి. కానీ బాగా చెప్పండి.