ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రీ నామినేషన్లకు అవకాశం ఇచ్చారు. బెదరింపుల వల్ల నామినేషన్లు దాఖలు చేయలదని, బలవంతంగా ఉపసంహరణ చేయించారనే కారణంతో రాష్ట్రంలో 11 చోట్ల రీ నామినేషన్ వేసేందుకు అనుగుణంగా కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతి కార్పొరేషన్లో ఆరు డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు వార్డులు, వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో మళ్లీ నామినేషన్లు స్వీకరించాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు (మంగళవారం) ఉదయం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు దాఖలకు అవకాశం ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మంగళవారం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచి తిరిగి ప్రారంభం కాబోతోంది. నామినేషన్ల ఉపసంహరణ నుంచి తిరిగి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ ఈ నెల 14వ తేదీతో ముగస్తుంది. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకగ్రీవమైన 11 చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయా డివిజన్లు, వార్డుల అభ్యర్థులు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. వారందరూ ఉమ్మడిగా లేదా వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. నిన్న తిరుపతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన నిమ్మగడ్డ.. ఎన్నికల కమిషన్ చరిత్రలో తొలిసారి విశేషాధికారాలను వినియోగించబోతున్నట్లు చెప్పారు. ఈ రోజు అన్నంత పని చేశారు.
Read Also : నిమ్మగడ్డ నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికలపై పీటముడి పడబోతోందా..?
16128