P Krishna
P Krishna
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్ని రకాలుగా సిద్దమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ తాము చేపట్టిన అభివృద్ది పనులు, అమల్లోకి తీసుకువచ్చిన పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే వచ్చే బీఆర్ఎస్ తరుపు నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకువస్తున్నారు సీఎం కేసీఆర్. తాజాగా తెలంగాణ రైతులకు మరో శుభవార్త తెలిపారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ సర్కార్ రైతులకు గొప్ప శుభవార్త తెలిపింది. ఇప్పటికే రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియ షరవేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా బ్యాంకుల నుంచి పలు సమస్యలను తీర్చుకుంటూ అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే బుధవారం వరకు 21.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు రూ.11,812 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వెల్లడించింది. తెలంగాణ రైతులు ఎలాంటి కష్టాలు పడొద్దని తమ ప్రభుత్వం రైతు పక్షాణ నిలబడిందని పలు మార్లు సీఎం కేసీఆర్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం బుధవారం రుణ మాఫీ కోసం ఏకంగా రూ.1000 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల రుణమాఫీ ప్రక్రియ చాలా వేగం కానున్నదని, రెండో విడత రుణమాఫీ ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రభుత్వం మొదలు పెట్టినట్లు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ సర్కార్ నిశ్చయించుకుంది. రానున్న రోజుల్లో రూ.లక్ష రుణం తీసుకున్న రైతుల రుణం సైతం మాఫీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు కేసీఆర్ సర్కార్ తెలిపింది.