iDreamPost
android-app
ios-app

విశాఖ భూ కుంభకోణం పై సిట్

విశాఖ భూ కుంభకోణం పై సిట్

విశాఖ నగరం, సమీప మండలాలు, ప్రాంతాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా చోటు చేసుకున్న భూ కుంభకోణాలపై వైఎస్సార్ కాంగ్రెస్ సర్కార్ తాజాగా సిట్ వేసింది. రిటైర్డ్‌ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి డా.విజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)లో రిటైర్డ్‌  ఐఏఎస్‌ అధికారి వైవీ అనురాధ, రిటైర్డ్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి టి.భాస్కరరావులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సిట్‌ బృందం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని నిర్దేశించింది. సభ్యులుగా అవసరమైతే అర్హులైన వారిని నియమించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం గురువారం రాత్రి జీవోని విడుదల చేశారు.

విధులు.. అధికారాలు..

-సిట్‌ బృందానికి ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులు, వెబ్‌ల్యాండ్‌ ఖాతాలను నిశితంగా పరిశీలించే అధికారం ఉంటుంది.

-మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూముల రికార్డులను.. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించే అధికారం ఉంది.

-ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయన్నదానిపై కమిటీ విచారణ జరుపుతుంది.

– రికార్డుల ట్యాంపరింగ్‌ ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతారు.

-భూ వివాదాలు, ఆరోపణలకు సంబంధించి ఏ అధికారినైనా, ఏ వ్యక్తినైనా పిలిచి విచారించే అధికారం సిట్‌కు ఉంది.

-ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది.

-జిల్లా అధికారులు సిట్‌కు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

-సిట్‌ బృందానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించింది.