టూరిస్ట్‌ ప్లేస్‌గా నిజామాబాద్‌ జైలు! మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కీలక ప్రకటన

నిజామాబాద్‌లోని ఖిల్లా జైలును పర్యాటక కేంద్రంగా మారుస్తామని తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యర్థన మేరకు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా దాశరథి కృష్ణమాచార్య గడిపిన జైలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.. దాశరథి పురస్కారాన్ని పండిత కవి అయాచితం నటేశ్వరశర్మకు బహూకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత కోరిక మేరకు దాశరథి గడిపిన ఖిల్లా జైలు టూరిస్ట్‌ ప్లేస్‌ మార్చి, అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనాథలు, అన్నార్థులు లేని కాలం, కరువు కాటకాలు లేని రోజల గురించి దాశరథి కలలు కన్నారని.. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ సారథ్యంలో నేడు అవి సాకారం అవుతున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణకు అత్యంత ఆత్మీయ కవి దాశరథి కృష్ణామాచార్యులు అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌ను కృష్ణదేవరాయలతో పోలుస్తూ పురస్కార గ్రహీత అయాచితం నటేశ్వరశర్మ పాటలు పాడారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన సాహిత్యంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కవిగా, రచయితగా, విద్యావేత్తగా సాహిత్య రంగంపై చెరగని ముద్ర వేసిన తెలంగాణ సాహితీ సౌరభమని కొనియాడారు. మరి నిజామాబాద్‌ ఖిల్లా జైలును పర్యాటక కేంద్రం మార్చనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హైదరాబాద్ లో సిటీ బస్సు టికెట్ ధర రూ.29 వేలు!

Show comments