IND vs ENG: ఇంగ్లండ్​తో తొలి టెస్ట్.. రోహిత్, ద్రవిడ్​కు తలనొప్పిగా మారిన 3 సమస్యలు!

ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​కు రెడీ అవుతోంది భారత్. అయితే సిరీస్​లోని తొలి మ్యాచ్​కు ముందు టీమ్ మేనేజ్​మెంట్​ను 3 సమస్యలు వేధిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​కు రెడీ అవుతోంది భారత్. అయితే సిరీస్​లోని తొలి మ్యాచ్​కు ముందు టీమ్ మేనేజ్​మెంట్​ను 3 సమస్యలు వేధిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​ను ముగించుకున్న టీమిండియా.. ఇంగ్లండ్​తో 5 టెస్టులు ఆడేందుకు రెడీ అవుతోంది. ఈ సిరీస్​లోని మొదటి మ్యాచ్​కు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఇవాళ భారత క్రికెటర్లు భాగ్యనగరానికి చేరుకోనున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్​కు చేరుకోవాలంటే ఈ సిరీస్​ను నెగ్గడం భారత్​కు కీలకంగా మారింది. ఫిట్​నెస్, పేషెన్స్​, స్కిల్స్​కు టెస్ట్​గా నిలిచే లాంగ్ ఫార్మాట్​లో బాగా పెర్ఫార్మ్ చేస్తే.. దాన్ని వచ్చే ఐపీఎల్​తో పాటు ఆ తర్వాత జరిగే టీ20 వరల్డ్ కప్​లోనూ కంటిన్యూ చేయొచ్చని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఈ సిరీస్​ స్టార్ట్ అవడానికి ముందు భారత్​ను మూడు సమస్యలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అసలు వాళ్లిద్దర్నీ వేధిస్తున్న ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో టీమిండియాను వేధిస్తున్న సమస్యల్లో మొదటిది వికెట్ కీపింగ్. ఈ సిరీస్​లో ఎవర్ని కీపర్​గా ఆడించాలనేది టీమ్ మేనేజ్​మెంట్​కు అర్థం కావడం లేదు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్​లో కేఎల్ రాహుల్ కీపర్​గా ఆకట్టుకున్నాడు. అయితే భారత్​లోని స్పిన్ పిచ్​లపై కీపింగ్ చేయడం డిఫరెంట్ ఛాలెంజ్. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు వేసే బంతులు గింగిరాలు తిరుగుతూ తెగ ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ సవాల్​ను స్వీకరించే కీపర్ అవసరం టీమిండియాకు ఉంది. కేఎల్ రాహుల్​ ఇటీవలే వెన్ను నొప్పితో బాధపడుతూ సర్జరీ చేయించుకున్నాడు. అందుకే అతడికి బ్యాకప్​ కీపర్లుగా తెలుగు కుర్రాళ్లు కేఎస్ భరత్, ధృవ్ జురేల్​ను ఎంపిక చేసింది బీసీసీఐ.

భారత్​లోని టర్నింగ్ ట్రాక్​లపై రాహుల్ సరిగ్గా కీపింగ్ చేయలేడేమోననే డౌట్​తోనే బ్యాకప్ కీపర్లను తీసుకున్నారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. రాహుల్​ను స్పెషలిస్ట్ బ్యాటర్​గానే ఆడిస్తారని టాక్. ఒకవేళ అదే నిజమైతే భరత్, ధృవ్​ల్లో ఎవరో ఒకరు ఆడటం ఖాయం. అయితే ఫస్ట్ టెస్ట్​కు ముందు హైదరాబాద్​లో నిర్వహించే ఫోర్ డే క్యాంప్​లో రాహుల్ ప్రదర్శనను బట్టి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఒకవేళ అందులో రాహుల్ ఫెయిలైతే ధృవ్​ను ఆడించడం పక్కా అని అనలిస్టులు అంటున్నారు. ఇప్పటికే కేఎస్ భరత్​ను ఒకసారి ఆడిస్తే అందులో అతడు పెద్దగా ఆకట్టుకోలేదు. కాబట్టి జురెల్ వైపు టీమ్ మేనేజ్​మెంట్ మొగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. రోహిత్-ద్రవిడ్​ను ఇబ్బంది పెడుతున్న మరో అంశం బ్యాటింగ్​కు సంబంధించినది. శ్రేయస్ అయ్యర్​, కేఎల్ రాహుల్​లో ఎవర్ని ఆడించాలనేది అర్థం కావడం లేదు. కీపింగ్​లో రాహుల్ ఫెయిలైతే అతడి నుంచి ఆ బాధ్యతలను ధృవ్ జురెల్, భరత్​ల్లో ఒకరికి అప్పగించాలనే ఆలోచనల్లో టీమ్ మేనేజ్​మెంట్ ఉందని తెలుస్తోంది.

ఒకవేళ కీపింగ్ చేయకపోతే రాహుల్, అయ్యర్​ల్లో ఒకరు మాత్రమే ఆడతారు. అప్పుడు ఎవర్ని తీసుకోవాలనేది కూడా సమస్యే. సౌతాఫ్రికా సిరీస్​లో సెంచరీ బాదిన రాహుల్ మంచి ఊపు మీద ఉన్నాడు. అయితే స్వదేశంలోని టర్నింగ్ పిచ్​ల మీద స్పిన్నర్లను ఆడటంలో అయ్యర్ ఎక్స్​పర్ట్​. భారత్​లో ఆడిన గత 11 ఇన్నింగ్స్​ల్లో అతడు ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవర్ని తీసుకోవాలో అర్థం గాక టీమ్ మేనేజ్​మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలా? లేదా ముగ్గురు సీమర్లతో వెళ్లాలా? అనేది కూడా సమస్యగా మారింది. ఈ సిరీస్​లో టర్నింగ్ వికెట్లు తయారు చేయాలని టీమ్ మేనేజ్​మెంట్ నుంచి ఆదేశాలు వెళ్లిన నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్ల ప్లాన్​కే మొగ్గ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు అశ్విన్, జడ్డూలకు తోడుగా కుల్దీప్, అక్షర్​ల్లో ఒకరు మెయిన్ టీమ్​లోకి వస్తారు. మరి.. ఈ సమస్యలను అధిగమించి ఈ సిరీస్​ను భారత్ నెగ్గుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments