వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా సిరీస్ ఆడటం టీమిండియాకు చాలా విధాలుగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఈ సిరీస్ ద్వారా భారత బ్యాటర్లు, బౌలర్లకు మంచి ప్రాక్టీస్ దొరికింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న సూర్యకుమార్ యాదవ్ ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో రాణించి తానేంటో నిరూపించుకున్నాడు. గాయం తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్, ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకున్నాడు. ఈమధ్య ఎక్కువగా ఛాన్సులు రాక బెంచ్‌కే పరిమితమైన వెటరన్ పేసర్ మహ్మద్ షమి కూడా వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. తొలి వన్డేలో 5 వికెట్లు తీసి తన బౌలింగ్‌లో పస తగ్గలేదని నిరూపించాడు. ఇలా అనేక విధాలుగా ఈ సిరీస్ భారత్‌కు అనుకూలంగా మారింది.
ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో నెగ్గిన టీమిండియా ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. వన్డేల్లో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కంగారూలను భారత్ వైట్‌వాష్ చేయలేదు. దీంతో ఈసారి ఛాన్స్‌ను అస్సలు వదలొద్దని రోహిత్ సేన అనుకుంటోంది. తొలి రెండు మ్యాచ్‌లకు రెస్ట్ తీసుకున్న హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌తో తిరిగి టీమ్‌లోకి రానున్నాడు. అతడితో పాటు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ కూడా బరిలోకి దిగుతారు. అయితే టీమ్‌ను వైరల్ ఫీవర్ పీడిస్తోంది. పలు కారణాల వల్ల మూడో వన్డేకు భారత్‌కు 13 మంది ఆటగాళ్లు మాత్రమే సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నారు.
చివరి వన్డే కోసం శుబ్‌మన్ గిల్‌కు రెస్ట్ ఇచ్చారు. పేసర్లు మహ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్‌తో పాటు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని హార్దిక్ పాండ్యా ఇంటికి వెళ్లిపోయారు. కొందరు జ్వరం కారణంగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఇద్దరికి మించి ఆటగాళ్లు గాయపడితే సహాయక సిబ్బంది లేదా లోకల్ ప్లేయర్లతో ఫీల్డింగ్ చేయించాల్సిన పరిస్థితి భారత్‌కు రానుంది. అందుకే ముందు జాగ్రత్తగా లోకల్ ప్లేయర్లను బ్యాకప్‌గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉంటూ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ఆటగాళ్లను పిలిచిపించారట. వీళ్లతో ప్రాక్టీస్ చేయించిన టీమిండియా మేనేజ్మెంట్.. మ్యాచ్ టైమ్‌లో అవసరమైతే వీరిని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా వాడుకోనుందని సమాచారం.
ఇదీ చదవండి: స్మృతి మంథాన కోసం 1,200 కి.మీ.లు జర్నీ చేసిన చైనా ఫ్యాన్!