Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. కొన్ని నెలలుగా థియేటర్లకు సంబంధించిన వివిధ అంశాలు, సినిమా టిక్కెట్ల ధరలు, బెనిఫిట్ షోల వ్యవహారంలో కొంత సందిగ్దత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రాంతాల వారీగా సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించడంపై సినీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై కోర్టులోనూ విచారణ జరుగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు సినీ టిక్కెట్ల ధరల నిర్ణయంపై కమిటీని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసింది. ధరలు, ఇతర అంశాలపై కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
తాజాగా కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ బృందంలో నటులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, అలీ. ఆర్.నారాయణమూర్తి, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళిలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వీరు తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.
సినీ ప్రముఖుల బృందం వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించనుంది. జీవో నంబర్ 35లో సవరణల ప్రతిపాదనలపై, టిక్కెట్ల ధరల పెంపుపై చర్చించనుంది. ఏసీ, నాన్ ఏసీ థియేటర్ల టిక్కెట్ల ధరలపై, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆహార పదార్థాల ధరలు, థియేటర్లలో విద్యుత్ ఫిక్సిడ్ ఛార్జీలపై చర్చించనున్నట్లు సమాచారం. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లో సినీ స్టూడియోల నిర్మాణంపై కూడా సినీ ప్రముఖుల బృందం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో చర్చించబోతోంది. ఈ భేటీతో సినిమా రంగానికి సంబంధించిన అన్ని అంశాలు ఓ కొలిక్కి వస్తాయనే భావన నెలకొంది.
Also Read : సినీ పరిశ్రమకు అండగా ఏపీ ప్రభుత్వం: పేర్ని నాని