హాస్యనటులు – హీరో వేషాలు

హాస్యనటులు బాగా పేరు సంపాదించాక హీరో వేషాలు వేయటం మనం చూస్తుంటాము. మొదటి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న కస్తూరి శివరావు తెరమీద కనపడితే చాలు జనాలు ఘొల్లున నవ్వేవారు. ఈయన హాస్యం కాస్త మోటు,మరికాస్త బూతు స్థాయిలో ఉండేది.

ఎన్టీఆర్,అక్కినేనిలు సైకిళ్ల మీద స్టూడియోలకు వెళితే ఈ హాస్య నటుడు కస్తూరి శివరావు కోటీశ్వరులు మాత్రమే కొనగలిగే బ్యూక్ కారులో షూటింగులకు వెళ్ళేవాడు. అదీ అప్పట్లో ఆయన స్థాయి. తానే ప్రధాన పాత్రలో నటిస్తూ పరమానందయ్య శిష్యులు అనే చిత్రాన్ని తానే నిర్మాతగా తీశాడు. ఆ సినిమా ఘోరంగా ప్లాప్ అయ్యి భారీగా నష్టపోయాడు. గుర్రపు పందేల పిచ్చికూడా ఉండటంతో సంపాదించిందంతా పోగొట్టి అనాధగా తనువు చాలించాడు.

రేలంగి..

ఆ తర్వాత గ్రేట్ కామెడీ కింగ్ రేలంగి హవా మొదలయ్యింది. అప్పట్లో రేలంగి లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. డిస్ట్రిబ్యూటర్లు రేలంగిలేని సినిమాకు పెట్టుబడిపెట్టేవారు కాదు.

రేలంగి హీరోగా రెండు సినిమాలు వచ్చాయి ఒకటి పక్కింటి అమ్మాయి, .రెండు మామకు తగ్గ అల్లుడు. మొదటి సినిమాలో అంజలి,రెండో సినిమాలో సావిత్రి జంటగా నటించారు. రెండు సినిమాలు బాగానే ఆడాయి. పక్కింటి అమ్మాయి తర్వాతకాలంలో హిందీలోను, మళ్లీ 30 ఏళ్ల తర్వాత తెలుగులోనూ అదే పేరుతో చంద్రమోహన్ జయసుధ జంటగా పునర్నిర్మితం అయ్యింది. రేలంగి మళ్లీ హీరోగా నటించలేదు.

పద్మనాభం…

రేలంగి తర్వాత పద్మనాభం మంచి హాస్యనటుడిగా గుర్తింపు పొందాడు. మొదట ఎన్టీఆర్ తో సొంత చిత్రం దేవత నిర్మించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తానే హీరోగా మర్యాదరామన్న, పొట్టి ప్లీడర్, శ్రీరామకథ, కథానాయిక మొల్ల, జాతకరత్నం మిడతంబొట్లు,ఆజన్మబ్రహ్మచారి, పెళ్లికాని తండ్రి,వెంకటేశ్వర వైభవం లాంటి చిత్రాలు నిర్మించారు. ఇందులో కొన్ని హిట్లు ప్లాఫులు కూడా ఉన్నాయి. ఒక డిస్ట్రిబ్యూటర్ చేసిన మోసంవల్ల తను నిర్మించిన చిత్రాలపై శాశ్వతంగా హక్కులు కోల్పోయాడు. సంపాదించిందంతా సినిమాల్లోనే పెట్టటంవల్ల చివరిరోజుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు.

చలం…

మొదట సెకండ్ హీరోగా,సహాయకపాత్రల్లో నటిస్తూ కమెడియన్ గా మంచిపేరు తెచ్చుకున్నాడు. తెలుగులో మొట్టమొదటి కామెడీ హీరోగా చెప్పుకోవచ్చు. రమణచిత్ర బ్యానర్ మీద సొంత చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. మొదట బుల్లెమ్మ బుల్లోడు చిత్రాన్ని ద్విపాత్రాభినయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించగా అది మంచివిజయాన్ని సాధించింది. వరుసగా సంబరాల రాంబాబు, మట్టిలో మాణిక్యం, తులాభారం,దేవుడమ్మ,తోటరాముడు,చైర్మన్ చలమయ్యా లాంటి చిత్రాలు తీశారు. ఇందులో కొన్ని హిట్లు కొన్ని ప్లాఫులు ఉన్నాయి.అటు పిమ్మట హాస్యనటుని గాను కొనసాగారు.

రాజబాబు…

తక్కువ సమయంలో రేలంగి తర్వాత అంతగొప్ప హాస్యనటునిగా పేరు తెచ్చుకున్నాడు రాజబాబు. ముఖ్యంగా 60,70 దశకంలో ప్రతి పది చిత్రాల్లో ఆరింట రాజబాబు ఉండాల్సిందే. కొన్ని చిత్రాల్లో హీరో కంటే ఎక్కువ పారితోషికం తీసుకునేవాడు. రాజబాబు  సినిమాలు హాట్ కేక్ లా అమ్ముడయ్యేవి. అది రాజబాబు చరిష్మా.

దాసరి నారాయణరావు మొదటిసారి దర్శకత్వం వహిస్తూ రాజబాబు హీరోగా తాతామనవడు సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత పిచ్చోడిపెళ్లి,తిరుపతి లాంటి చిత్రాల్లో హీరోగా నటించినా పెద్దగా ఆడలేదు. బాబ్&బాబ్ పేరున సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించిన రాజబాబు ఎవరికివారే యమునా తీరే, మనిషిరోడ్డున పడ్డాడు సినిమాలు తానే హీరోగా నిర్మించి విడుదల చేశాడు. రెండుసినిమాలు దారుణం పరాజయం పొంది నష్టాలను మిగిల్చాయి. భార్యాపిల్లల పేరున ఉన్న ఆస్థితప్ప అన్నీ పోయాయి. మళ్లీ కమెడియన్ గా వేషాలు మొదలుపెట్టాడు. కానీ అప్పటికే మాడా,సారధిలాంటి హాస్యనటులు బిజీగా ఉండటంతో రాజబాబుకు అవకాశాలు తగ్గాయి.

మొదట హీరోగా వచ్చిన చంద్రమోహన్, చిన్నవేశాలతో కెరీర్ ప్రారంభించిన రాజేంద్రప్రసాద్ లు లోబడ్జెట్ చిత్ర నిర్మాతల కామెడీ హీరోలుగా కొనసాగారు. రాజేంద్రప్రసాద్ మేడమ్, రామబంటు లాంటి సొంత చిత్రాలు నిర్మించాడు. మేడమ్ యావరేజ్ కాగా రామబంటు నష్టాలు తెచ్చిపెట్టింది.

written by 

Sankar.G

Show comments