Idream media
Idream media
సంక్రాంతి పండుగ మూడు రోజులు కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో నిర్వహించారంటూ విమర్శలు మొదలుపెట్టిన టీడీపీ నేతలు… పండగ ముగిసి పక్షం రోజులు పూర్తయినా ఇంకా దానిపైనే రాజకీయం సాగిస్తున్నారు. కేసినో అంశంలో తనకు సంబంధం లేదని, ఆ సమయంలో హైదరాబాద్‌లో కరోనాకు చికిత్స తీసుకుంటున్నానని మంత్రి కొడాలి నాని చెప్పినా.. రాజకీయ సన్యాసం సవాల్ విసిరినా పట్టించుకోని టీడీపీ నేతలు.. దాన్ని కొడాలి మెడకు చుట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. కేసినో పై నిజనిర్థారణ కమిటీ అంటూ ఆ మధ్య గుడివాడలో హడావిడి చేసిన టీడీపీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమా, కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్రలు.. తాజాగా తాము శోధించి సాధించిన నిజాలతో ఓ నివేదికను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అందించారు.
టీడీపీ అధినేత ఆదేశాల మేరకు తదుపరి ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలో కూడా వారు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. గుడివాడలో కేసినో నిర్వహించారనే విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించిందని వర్లరామయ్య, కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్రలు తెలిపారు. జాతీయ స్థాయిలో కేసినో అంశాన్ని తీసుకెళ్లడం ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తారని వారు తమ కార్యాచరణను మీడియాకు వెల్లడించారు. ఆ నిజాలను ఏపీ పోలీసులకు ఎందుకు ఇవ్వడంలేదనే ప్రశ్న రాకుండా.. డీజీపీపై కూడా వర్ల రామయ్య విమర్శలు చేశారు. అంతిమంగా కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే వరకూ విశ్రమించేదిలేదని టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారు.
మొత్తం మీద కేసినో అంటూ గోల చేస్తున్న టీడీపీ నేతలు.. మంత్రి కొడాలి నాని మాటలను నిజం చేసేలా ఉన్నారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రచ్చ చేసిన టీడీపీ నేతలు.. వర్ల రామయ్య నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఈ సమయంలో స్పందించిన కొడాలి నాని.. గవర్నర్ వరకే కాదు రాబోయే రోజుల్లో రాష్ట్రపతి, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని, అప్పటి వరకు ఈ అంశాన్ని వదలిపెట్టవద్దని కూడా నాని టీడీపీ నేతలకు చురకలు అంటించారు.
నాని ఎటకారంగా మాట్లాడిన మాటలను టీడీపీ నేతలు నిజం చేసేలా ఉన్నారు. అందులో భాగమే కేసినో అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామనే ప్రకటనలు చేసినట్లున్నారు. టీడీపీ నేతల తీరు చూస్తున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు లేవని అధికార వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ సర్కార్ ఒప్పుకున్న ప్రత్యేక ప్యాకేజీ నిధుల మాట లేదు. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. రైల్వే జోన్ మాట అస్సలే లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పార్లమెంట్‌లో మాట్లాడాల్సిన అంశాలు అనేకం ఉన్నా.. టీడీపీ నేతలకు అవేమీ పట్టనట్లు, అవేమీ అంత ముఖ్యం కానట్లుగా వ్యవహరిస్తున్నారు. తలాతోకలేని, ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగం లేని కేసినో అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు టీడీపీ సిద్ధమవడం ఆ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది తెలియజేస్తోంది. నాని అన్నట్లు రాబోయే రోజుల్లో కేసినో అంశాన్ని రాష్ట్రపతికి, ఆ తర్వాత జో బైడెన్‌కు ఫిర్యాదు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Also Read : నిజనిర్ధారణ కమిటీలతో టీడీపీ ఏమి చేస్తోంది..?