Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , ఉద్యోగుల మధ్య చర్చలు ఫలప్రదం దిశగా సాగుతున్నాయి. ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఓ మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. ఉద్యోగుల ముందు కొత్త ప్రతిపాదనలు పెట్టింది. నిన్న సాయంత్రం మొదలైన చర్చలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా సమస్యను కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రభుత్వం పాత హెచ్‌ఆర్ఏ కొనసాగించడం ఆర్థికంగా భారం అని చెబుతూ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా ఉండేలా జీవోల్లో మార్పులు చేస్తామని ప్రతిపాదన పెట్టింది. రెండు లక్షల మంది జనభా ఉన్న ప్రాంతాలకు ఎనిమిది శాతం, 2 నుండి 5 లక్షల జనాభా ఉండే ప్రాంతాలకు12, 5-15 లక్షల జనాభా ప్రాంతాలకు 16 శాతం, 15 లక్షలపైన జనాభా ఉండే ప్రాంతాలకు 24 శాతం హెచ్‌ఆర్‌ఎను మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. అదే విధంగా రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పాత విధానాన్ని కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది. 70 ఏళ్ల వారికి ఐదు శాతం, 75 ఏళ్లపైబడిన వారికి 10 శాతం ఇస్తామని మంత్రుల కమిటీ తెలిపింది.
అయితే, ఐఆర్ 27 శాతం ఉన్నందున ఫిట్‌మెంట్ 30శాతం వరకూ ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తగ్గడంపై అసంతృప్తిగా ఉన్నారు. 23 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించవద్దని కోరుతున్నారు. ఉద్యోగుల వినతి మేరకు గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని డీఏలను ఒకే సారి మంజూరు చేసిన ప్రభుత్వం వాటికి చెల్లించాల్సిన ఎరియర్స్‌ను ఈ ఐఆర్‌తో కవర్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు రికవరీ లేకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయంలో రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని అనుకోవచ్చు.
ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పీఆర్సీ జీవోల్లో మరో పదేళ్ల వరకూ పీఆర్సీ ఉండదని ..కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నియమించే వేతన సవరణ కమిటీ నివేదిక ఆధారంగానే తాము కూడా వేతన సవరణ చేస్తామని చెప్పింది. ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పట్లాగే ఐదేళ్లకోసారి రాష్ట్ర పీఆర్సీనే ఉండాలంటున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు మంత్రుల కమిటీ సుముఖత వ్యక్తం చేసింది.