మేఘాలయకు పాకిన కాంగ్రెస్ సంక్షోభం -మాజీ సీఎం సహా 12 మంది టీఎంసీలోకి?

కాంగ్రెసుకు గడ్డు కాలం దాపురించింది. ఒకవైపు పార్టీని పటిష్టపరిచేందుకు యువనేతలను చేర్చుకుంటుంటే.. మరోవైపు పాత నాయకులు జారిపోతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్, చత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తలెత్తిన సమస్యలే పరిష్కరించలేక తలపట్టుకుంటున్న పార్టీ హై కమాండ్ ను కొత్త సమస్యలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇంతవరకు బీజేపీ జాతీయ స్థాయిలో కాంగ్రెసు నుంచి వలసలను ప్రోత్సహిస్తుంటే.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోంది. ఫలితంగా కాంగ్రెస్ కష్టాలు ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు కూడా విస్తరించాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాతో సహా డజను మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.

టీఎంసీ విస్తరణకు కాంగ్రెసుపై వల.. 

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ.. దానికోసం పశ్చిమ బెంగాల్ దాటి ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ శాఖలు ఏర్పాటు చేసి పటిష్ట పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీకి గట్టి పునాదులు వేయగలిగే నేతల అన్వేషణలో కాంగ్రెసునే టార్గెట్ చేస్తున్నారు. 

మొదట అసోంలోని సిల్చార్ ఎంపీగా ఉన్న మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ను పార్టీలోకి చేర్చుకొని త్రిపుర బాధ్యతలు అప్పగించారు. తర్వాత గోవాలో కాంగ్రెస్ మాజీ సీఎం లూజినో ఫెలీరోను చేర్చుకున్నారు. ఇప్పుడు మేఘాలయపై దృష్టి పెట్టారు. ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెసుకు చెందిన మాజీ సీఎం ముకుల్ సంగ్మా పార్టీపై అసంతృప్తితో ఉన్న విషయం గుర్తించి తన ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ టీమ్ ద్వారా మంతనాలు జరిపి టీఎంసీలో చేరేలా ఒప్పించినట్లు సమాచారం.

Also Read : నేతల వలసలతో కాంగ్రెస్ విలవిల.. రాహుల్ గాంధీతోనే మొదలైన పరంపర

పార్టీ అగ్రనేతలపై అసంతృప్తి.. 

60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయాలో 2018 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఎన్పీపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 38 సీట్లతో అధికారం చేపట్టింది. 17 స్థానాలతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. మాజీ సీఎం ముకుల్ సంగ్మా ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా పార్టీ హై కమాండ్ తనపట్ల చిన్నచూపు చేస్తోందని సంగ్మా భావిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోకసభ సభ్యుడు విన్సెంట్ హెచ్ పాలాను నియమించడం సంగ్మాను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దాంతో కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల కోల్ కతాకు వెళ్లి టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. వాటిని సంగ్మా ఖండించిన కొద్దిరోజులకే.. ఇటీవలే కాంగ్రెసు నుంచి టీఎంసీలో చేరిన సుస్మిత దేవ్ రాష్ట్రానికి రావడంతో సంగ్మా ఆ పార్టీలో చేరుతారన్న ప్రచారానికి బలం చేకూర్చింది. సంగ్మాతో పాటు ఆయన వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంపై సంగ్మా వర్గానికి చెందిన తమల్ సాహా మాట్లాడుతూ పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారానికి ఎదురు చూస్తున్నామన్నారు. అవి పరిష్కారం కాకపోతే టీఎంసీలో చేరడం ఖాయమని స్పష్టం చేశారు. అదే జరిగితే గోవాలో మాదిరిగా మేఘాలయాలోనూ కాంగ్రెస్ బలం సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుంది.

Also Read : మమత కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తున్నారా? తృతీయ కూటమికి అది విఘాతమేనా

Show comments