జీతాలు, పీఆర్‌సీ బదులు ఉద్యోగులకు స్వయంప్రతిపత్తి..!

వర్తమాన అంశాలపై స్పందిస్తూ.. తనదైన హామీలు ఇస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. తాజాగా ఉద్యోగుల జీతాలు, పీఆర్‌సీ అంశంపై కూడా భిన్నంగా స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అంటూ మొదలుపెట్టిన సోము వీర్రాజు ఉద్యోగులకు బంపరాఫర్‌ ఇచ్చారు. జీతాలు, పీఆర్‌సీపై ఉద్యోగులు ఉద్యమం చేస్తుండగా.. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. ఉద్యోగులకు జీతాలు, పీఆర్‌సీ బదులు స్వయం ప్రతిపత్తి ఇస్తామని అర్థం కాని హామీ ఇచ్చారు. నెలవారీ జీతాలు, ఐదేళ్ల కోసారి జీతాలు సవరించే పీఆర్‌సీ కాకుండా.. ఈ స్వయం ప్రతిపత్తి ఏమిటో ఉద్యోగులకే కాదు ప్రజలకు, కమలదళానికి కూడా అర్థంకావడం లేదు.

చీప్ లిక్కర్‌ క్వార్టర్‌ 50 రూపాయలకే ఇస్తాం.. బియ్యం కేజీ 40 రూపాయలకే ఇస్తాం.. అని సోము వీర్రాజు ఇచ్చిన హామీలు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యాయి. కానీ జీతాలు, పీఆర్‌సీ బదులు ఉద్యోగులకు ఇస్తామంటున్న ఈ స్వయంప్రతిపత్తి అంటే ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. పనిచేసిన వారికి రోజువారీ కూలి, నెలవారీ జీతం ఇవ్వడం ప్రైవేటు రంగంలోనైనా, ప్రభుత్వ రంగంలోనైనా సర్వసాధారణం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు వివిధరకాల సేవలు అందిస్తుంటారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరవేస్తారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్, వ్యవసాయం ఇలా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండే విభాగాలతోపాటు.. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని రోడ్లు, రహదారులు, పంచాయతీ రాజ్‌ సహా వివిధ విభాగాలు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను, అభివృద్ధి పనులను నిర్వహిస్తుంటాయి.

వీరందరికీ జీతాలు బదులు స్వయం ప్రతిపత్తి అంటే.. చేసిన పనికి ఇంత మొత్తం ప్రజల నుంచి లేదా ప్రభుత్వం నుంచి ఫీజు తీసుకునే వెలుసుబాటును బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవ్వబోతోందా..? ఆ మొత్తం కూడా ఎంత అనేది కూడా ఉద్యోగులే నిర్ణయించుకునే అవకాశం సోము వీర్రాజు ప్రభుత్వం ఇస్తుందా..? పింఛన్‌ మంజూరు చేస్తే ఇంత, పిల్లలకు చదువులు చెబితే ఇంత మొత్తం, జనన ధృవీకరణ పత్రం జారీ చేస్తే ఇంత, ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తే ఇంత మొత్తం.. అని ఉద్యోగులే నిర్ణయించుకుని, ఆ మొత్తం ప్రభుత్వం లేదా ప్రజలనుంచి తీసుకునేలా సోము వీర్రాజు ప్రతిపాదిస్తున్న స్వయం ప్రతిపత్తి విధానం ఉంటుందా..?

రాజుల కాలం నాటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగులకు జీతాలే ఇస్తున్నారు. ప్రజలు కట్టే పన్నులపైన ప్రభుత్వం నడుస్తుంది. ఆ పన్నుల నుంచే జీతాలు చెల్లిస్తారు. తాతలకాలం నుంచి వస్తున్న ఈ విధానం కాకుండా.. ఈ స్వయం ప్రతిపత్తి ఏమిటో సోము వీర్రాజు గారే సెలవియ్యాలి. దీనితోపాటు ఈ స్వయం ప్రతిపత్తి విధానం ఆంధ్రప్రదేశ్‌ వరకే పరిమితమా..? లేక కేంద్రంలోనూ అమలు చేస్తారా..? అనే విషయం కూడా సోము వీర్రాజు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. తద్వారా ప్రపంచంలోనే అద్భుతమైన సంస్కరణను ప్రతిపాదించిన నేతగా సోము వీర్రాజు చరిత్రలో నిలిచిపోతారు.

Also Read : పీవీని ఓడించిన బీజేపీ మాజీ ఎంపీ కన్నుమూత

Show comments