Idream media
Idream media
రాయలసీమలో పుట్టి, అక్కడి నుంచే రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రాంతంపై వివక్ష చూపుతున్నారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. సీమ ద్రోహిగా మారుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయనపై ఈ ప్రాంతంలో వ్యతిరేకత పెరుగుతోంది అనేందుకు కుప్పం మున్సిపాల్టీలో కూడా బాబు ప్రభావం పనిచేయకపోవడమే నిదర్శనం. గతంలో నీటి ప్రాజెక్టులు, ఇప్పుడు కర్నూలు హైకోర్టుకు బ్రేకులు పడేలా ఆయన వ్యవహారశైలి ఉండడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసినా రాయలసీమకు చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయారు. పైగా టీడీపీ హయాంలో నీటి ప్రాజెక్టుల పేరుతో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లుగా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. దేశంలోనే అత్యల్పంగా వర్షపాతం నమోదయ్యే అనంతపురంలో హంద్రీ – నీవా ప్రాజెక్టుపై కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయించారు. సాగునీటి పథకంగా ఉన్న దీన్ని కేవలం తాగునీటికే పరిమితం చేశారు. అనంతరం వైఎస్ . రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే.. సీమ కరువుతో అల్లాడిపోయేది. ఆయన చొరవతో బాబు ఆపేసిన ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… కేవలం అనంత పురం జిల్లాలోనే మూడొందలకు పైగా చెరువులు నిర్మించారు. అలాగే భారీ ప్రాజెక్టుల్లో కదలిక తెచ్చారు.
ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా టీడీపీ అధినేత చంద్రబాబు తీరులో మార్పు కనిపించడం లేదని ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీమ అభివృద్ధికి కొత్త ప్రాజెక్టుల రూపకల్పనతో పాటు.. కర్పూలులో హైకోర్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అయితే, తన పుట్టుకకు, ఉన్నతికి దోహదపడిన రాయలసీమ అంటే గిట్టకుండా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ చంద్రబాబు ద్రోహి గా మారుతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధి, మూడు రాజధానుల ఏర్పాటు కోరుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్) ఇటీవల తిరుపతిలో నిర్వహించిన ర్యాలీలో బాబు బండారాన్ని బట్టబయలు చేసింది.
కర్నూలులో హైకోర్టు పెడితే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటో తెలియడం లేదని ఆప్స్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ యాత్రకు కథా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబేనని విమర్శించారు. అలాగే, సీమ అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరిన కమ్యూనిస్టులు కూడా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆప్స్ నేత రఫీ ఆరోపించారు. అమరావతి రాజధాని పేరుతో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు రైతుల వేషంలో టీడీపీ, కమ్యూనిస్టులు, జనసేన నేతలు తిరుపతిలో యాత్ర సాగించడం రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ శ్రీభాగ్ ఒప్పందానికి విఘాతం కలిగించిందన్నారు. ఇలా తన వ్యవహారశైలితో రాయలసీమలో తిరుగుబాటు వచ్చేలా బాబు చేసుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.