స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ ని జాతికి అంకితం చేసిన మోడీ..

శ్రీ భగవత్‌ రామానుజుల వారి ఆధ్యాత్మిక క్షేత్రం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లం, ముచ్చింత‌ల్ అద్భుతంగా రూపుదిద్దుకున్న శ్రీ‌రామ‌న‌గ‌రంలోకి దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ శ‌నివారం సాయంత్రం విచ్చేశారు. సంప్ర‌దాయ దుస్తుల్లో, తిరునామాలు ధ‌రించి యాగ‌శాల‌కు విచ్చేసిన ఆయ‌న‌కు త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి, మై హోం సంస్థ‌ల అధినేత రామేశ్వ‌ర‌రావు స్వాగ‌తం ప‌లికారు.

సుగంధ‌భ‌రిత పుష్పాల‌తో అలంక‌రించిన యాగ‌శాల‌కు చేరుకున్న మోడీ విశ్వ‌క్సేనుడి పూజ‌ల్లో పాల్గొన్నారు. రుత్వికుల వేద మంత్రోచ్చ‌ర‌ణ‌ల మ‌ధ్య ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మోడీతో పాటు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కూడా పూజ‌ల్లో పాల్గొన్నారు. మ‌ధ్య మ‌ధ్య‌లో పూజ విశిష్ట‌త‌ల‌ను చిన‌జీయ‌ర్ స్వామి మోడీకి ప్ర‌త్యేకంగా వివ‌రించేవారు. అందుకు ప్ర‌తిగా మోడీ న‌మ‌స్క‌రిస్తూ, న‌వ్వుతూ ఆయా విశిష్ట‌త‌ల‌ను ఆసక్తిగా ఆల‌కించేవారు. చిన‌జీయ‌ర్ స్వామి ఇచ్చిన కంక‌ణాన్ని ధ‌రించిన మోడీ సంక‌ల్ప‌సిద్ధి కోసం విశ్వ‌క్సేనుడిని పూజించారు.

యాగం అనంత‌రం కాన్వాయ్ లో స‌మ‌తామూర్తి విగ్ర‌హం చెంత‌కు చేరుకున్నారు. చిన‌జీయ‌ర్ స్వామి వెంట ఉండి శ్రీ‌రామ న‌గ‌రంలోని అనువ‌ణువుకూ ఉన్న విశిష్ట‌త‌ల‌ను వివ‌రించేవారు. స‌మ‌తామూర్తి స‌న్నిధిలోని శ్రీ రంగ‌నాథుడిని ద‌ర్శ‌నం చేసుకున్నారు. దివ్య దేశాల పేరుతో ఏర్పాటు చేసిన 108 ఆల‌యాల ద‌ర్శ‌నం, స‌మ‌తా మ్యూజియాన్ని సంద‌ర్శించారు. ఆ స‌న్నిధి చ‌రిత్ర‌ను ఆస‌క్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం చారిత్ర‌క ఘ‌ట్టం ఆవిష్క‌ర‌ణ వైపు అడుగులు వేశారు. 18 వేల టన్నుల ప్రతిమ. కూర్చున్నట్టు నిర్మించిన విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం.. 216 అడుగుల ఎత్తులో స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీకి స్ఫూర్తిగా నిలిచిన 120 కిలోల సువ‌ర్ణ‌మూర్తి విగ్ర‌హాన్ని శ‌నివారం సాయంత్రం 6.32 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆవిష్క‌రించారు. అతి భారీ విగ్ర‌హాన్ని ఆస‌క్తిగా తిల‌కించి జాతికి అంకితం చేశారు.

న‌రేంద్ర మోడీకి స్వాగ‌తం ప‌లికేందుకు వెళ్ల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్, జ్వ‌రం కార‌ణంగా స‌మ‌తామూర్తి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌కు కూడా హాజ‌రుకాలేదు. ఆవిష్క‌ర‌ణ అనంత‌రం స‌మ‌తామూర్తి స‌న్నిధిలో ఏర్పాటు చేసిన వేదిక‌పై శ్రీ‌రామ‌న‌గ‌రం ఏర్పాటుకు చేసిన కృషిని, తెలంగాణ వైకుంఠంగా పేరొందే ఈ ఆశ్ర‌మం విశిష్ట‌ను చిన‌జీయ‌ర్ స్వామి వివ‌రించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోడీ కంక‌ణ‌బ‌ద్ధులై ఉన్నార‌ని చెప్పారు. ఈ వేదిక‌పై కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ వెయ్యేళ్ల క్రిత‌మే స‌మ స‌మాజానికి కృషి చేసిన శ్రీ రామానుజాచార్యుల స్ఫూర్తి ప్ర‌స్తుత స‌మాజానికి చాలా అవ‌స‌రం అన్నారు. ఎంతో శ్ర‌మించి అద్భ‌తంగా ఈ దివ్య‌క్షేత్రాన్ని తీర్చిదిద్దినందుకు చిన‌జీయ‌ర్ స్వామి పాద‌ప‌ద్మాల‌కు న‌మ‌స్కార‌మ‌న్నారు. మోడీ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంతోషం కోసం రామానుజాచార్యుల అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నార‌ని చెప్పారు. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నార‌ని కొనియాడారు. స‌మ స‌మాజం కోసం కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని వివ‌రించారు. రాముడిలా మోడీ కూడా రాజ‌ధ‌ర్మం ఆచ‌రిస్తున్నార‌ని తెలిపారు.

అనంత‌రం గురువును, రామానుజాచార్యుడిని స్మ‌రిస్తూ మోడీ ప్ర‌సంగం ప్రారంభించారు. వ‌సంత పంచ‌మి రోజే విగ్ర‌హావిష్క‌ర‌ణ సంతోషంగా ఉంద‌ని చెప్పారు. శ్రీ‌రామానుజుల వారి మార్గం అంద‌రికీ ఆచ‌ర‌ణీయం అన్నారు. 12 మంది అళ్వారులు దేశ‌మంతా ప‌ర్య‌టించారు. నాకు ఆ ద‌ర్శ‌న భాగ్యం ఇక్క‌డే క‌లిగింద‌న్నారు. 108 దివ్య దేశాల మందిరాల ఏర్పాటు అద్భుత‌మ‌న్నారు. ఈ ఆల‌యాల కోసం 12 మంది అళ్వారులు దేశ‌మంతా ప‌ర్య‌టించారని చెప్పారు. ప్ర‌పంచ స్థాయి ప‌ర్యాట‌క కేంద్రంగా వ‌ర్థిల్లుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. జీయ‌ర్ స్వామి అనుగ్ర‌హంతో విశ్వ‌క్సేనుడి హోమంలో పాల్గొనే అదృష్టం ద‌క్కిందన్నారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ కూడా స‌మ స‌మాజం కోసం కృషి చేశార‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా పేద‌ల అభ్యున్న‌తి కోసం పాటుప‌డుతోంద‌ని చెప్పారు. సామాజిక న్యాయం అంద‌రికీ అందాల‌న్నారు. విజ్ఞానం, వైరాగ్యం, ఆద‌ర్శాల‌కు ఈ విగ్ర‌హం ప్ర‌తీక అని చెప్పారు.

హైద‌రాబాద్ ఏర్పాటులో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పాత్ర కీల‌కం అన్నారు. తెలుగు సినిమా ఘ‌నత ప్ర‌పంచ స్థాయికి చేరుకుంద‌న్నారు. శాత‌వాహ‌నులు, కాక‌తీయులు, విజ‌య‌న‌గ‌ర రాజులు తెలుగు ఖ్యాతిని చాటారు అని తెలిపారు.
పోచంప‌ల్లి కి ప్ర‌పంచ వార‌స‌త్వ గ్రామంగా ఘ‌న‌త ద‌క్కింద‌ని చెప్పారు.

Show comments