పార్ల‌మెంట్ స‌మావేశాల ముందు రోజే మ‌ళ్లీ పెగాస‌స్‌..

గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను పెగాస‌స్ కుదిపేసింది. స‌మావేశాలు ప్రారంభం మొద‌లు ముగిసే వ‌ర‌కూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. స‌రిగ్గా పార్ల‌మెంట్ స‌మావేశాల ప్రారంభం ముందురోజే పెగాసస్ స్పైవేర్ వార్తలు వెలుగులోకి రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, ఇప్పుడు పెగాస‌స్ వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింది. అదికూడా రేప‌టి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న స‌మ‌యంలోనే.

ఆ సమావేశాల్లో అధికార, విపక్షాలు ఈ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ ఉదంతంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి.

‘ది వైర్‌’ గత ఏడాది జూలైలో పెగాసస్‌ స్కామ్‌ను బయటపెట్టింది. పెగాసస్‌ తో ముడిపడిన ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ వో పేరు అప్పట్లో ప్రముఖంగా తెరపైకి వచ్చింది. పెగాసస్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేసి, విక్రయిస్తోంది. భారత్‌సహా పలు దేశాల ప్రభుత్వాలు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసినట్టు ఈ వెబ్‌ న్యూస్‌ పోర్టల్‌ వెల్లడించడం అప్పట్లో సంచలనం రేపింది. రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులపైకి కొన్ని దేశాలు పెగాసస్‌ ను ప్రయోగిస్తున్నాయంటూ గత ఏడాది వేసవిలో ఫార్‌బిడెన్‌ స్టోరీస్‌ అనే కన్సార్షియం ఆఫ్‌ న్యూస్‌ ఆర్గనైజేషన్స్‌ సమూహం.. పెగాసస్‌ పై వరుస కథనాలు ప్రచురించింది. వీటి ఆధారంగా ‘ద వైర్‌’ ఈ వ్యవహారాన్ని భారత్‌లో వెలుగులోకి తెచ్చింది.

ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ సహా 300 మంది రాజకీయ నాయకులు, పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలు, మాజీ న్యాయమూర్తులపై ఈ స్పైవేర్‌ను కేంద్రం వినియోగించినట్టు పేర్కొంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేశాయి. కేంద్రం మాత్రం పెగాసస్‌ తో తమకు నిమిత్తం లేదని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. వ్యక్తిగత గోప్యతను ప్రశ్నార్థకంగా మార్చిన ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబరులో జోక్యం చేసుకుంది. సీనియర్‌ జర్నలిస్టు ఎన్‌.రామ్‌సహా పలువురు వేర్వేరుగా ఈ అంశంపై వేసిన పిటిషన్లపై కోర్టు స్పందించింది.

Also Read : భారత రాజకీయాలను శాసిస్తున్న అమెరికా మీడియా

పిటిషనర్లు, ప్రభుత్వం అంగీకరిస్తే స్వతంత్ర నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపిస్తానని కోర్టు ప్రతిపాదించగా.. అన్ని పక్షాలూ అంగీకరించాయి. దీనిపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర‌స్థాయిలో స్పందించింది. ఇప్పుడు మ‌ళ్లీ పెగాస‌స్ తెర‌పైకి వ‌చ్చింది. న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో పెగాసస్ దుమారం మరోసారి రేగింది. ఈ స్పైవేర్ ను భారత్ 2017లో ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యంగ్యం ప్రదర్శించారు. పెగాసస్ స్పైవేర్ లో కొత్త వెర్షన్ లు ఏమైనా వచ్చాయేమో ఇజ్రాయెల్ ను అడిగి కనుక్కోండి… ఇదే తగిన సమయం అంటూ సెటైర్ వేశారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల సంబంధాల్లో కొత్త లక్ష్యాలు ఇప్పుడు నిర్దేశించుకోవచ్చు అని ఎద్దేవా చేశారు. “2017లో పెగాసస్ స్పైవేర్, ఇతర ఆయుధ ఒప్పందాల కోసం 2 బిలియన్ డాలర్ల డీల్ కుదిరిందని అంటున్నారు.

2024 ఎన్నికల కోసం కేంద్రం 4 బిలియన్ డాలర్లయినా చెల్లించగలదు. మరింత అభివృద్ధి పరిచిన స్పైవేర్లు మరిన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగానే ఉన్నట్టుంది ” అని విమర్శించారు. కాగా, న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంపై కేంద్రమంత్రి వీకే సింగ్ స్పందిస్తూ, అదొక సుపారీ మీడియా అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలను చిదంబరం తప్పుబట్టారు. “ఎప్పుడైనా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు చదివారా? వాటర్ గేట్, పెంటగాన్ పత్రాల కుంభకోణాలను బట్టబయలు చేయడం పత్రికలు ఎంత కీలకపాత్ర పోషించాయో తెలుసా? చరిత్ర తెలుసుకోవడం నచ్చకపోతే కనీసం సినిమాలు చూసైనా నేర్చుకోవాలి?”అని హితవు పలికారు.

Also Read : అమెరికా మీడియా ప్రకంపనలు, పెగాసస్ ఇండియా కొన్నది నిజమే అంటూ కథనం…!

Show comments