Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ ఎన్నికల తొలి దశ సంగ్రామానికి సమయం సమీపిస్తోంది. దీంతో అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం గోరఖ్‌పూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కేంద్రహోం మంత్రి అమిత్ షా ఆయనతో పాటే ఉన్నారు. అదే రోజు పశ్చిమ యూపీలోని ఘజియాబాద్, మేరట్, హాపూర్, అలీగఢ్, నోయిడా జిల్లాలోని ఇరవై మూడు నియోజకవర్గాల్లో బీజేపీ నిర్వహించిన వర్చువల్ ప్రచారసభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ.. అసాంఘిక శక్తులను ఎన్నికల బరిలోకి దించుతోందని ఆరోపించారు. అలాంటి నకిలీ సోషలిస్టులు (ఫేక్ సమాజ్‌వాదీలు) అధికారంలోకి వస్తే పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను దోచుకుంటారని అన్నారు. వారిని అధికారంలోకి రానివ్వొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో శాంతిభద్రతలను పకడ్బందీగా అమలు చేసిందని, నేరస్థులపై ఉక్కుపాదం మోపిందని తెలిపారు. ఈ విషయంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని 14 నియోజకవర్గాల్లో ప్రధాని మోదీతో బీజేపీ నిర్వహించ తలపెట్టిన వర్చువల్ ప్రచారం.. వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 1000 మంది ప్రజలు హాజరయ్యేలా ఈ సభలకు ఏర్పాట్లు చేయగా.. ఉదయం నుంచే వర్షం కురుస్తుండడంతో వాటిని రద్దు చేశారు. కాగా, యోగి పాలనలో నేరస్థులంతా పోలీస్‌స్టేషన్లకు పరుగులు పెడుతూ వెళ్లి లొంగిపోయారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం నేరస్థులు జైళ్లలోనో, యూపీ వెలుపలనో ఉన్నారని, లేదంటే సమాజ్‌వాది పార్టీలో ఉన్నారని ఆరోపించారు.
సిద్ధార్థ్‌నాథ్‌సింగ్‌పై దాడి
యూపీలో అసదుద్దీన్‌పై దాడి ఘటన మరువక ముందే కేంద్ర మంత్రి సిద్ధార్థ్‌నాథ్‌సింగ్‌పై ఓ వ్యక్తి సర్జికల్ బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకుగాను కేంద్రమంత్రి బీజేపీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా.. హిమాన్షు దూబే అనే వ్యక్తి ఆయనపై సర్జికల్ బ్లేడుతో దాడి చేశాడు. కార్యకర్తలు అతణ్ని అడ్డుకోగా.. పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Also Read : యోగీకి బీజేపీ అగ్రనేతలకు అదే వ్యత్యాసం..!