Idream media
Idream media
పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి పరిణతి కనబరిచారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపడమే కాదు.. భవిష్యత్ లో ఏ ఇబ్బంది కలిగినా మాట్లాడుకునేందుకు మంత్రుల కమిటీని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రభుత్వం మీది.. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను.. అని పేర్కొనడం ద్వారా ఉద్యోగులకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను వెలిబుచ్చారు. అలాగే.. పరిస్థితులు బాగుంటే మిమ్మల్ని మరింత సంతోషపెట్టే వాడినంటూ వారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. అయితే మరో ప్రభుత్వ సలహాదారు మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య కుదిరిన ఒప్పందానికి మించి ఉన్నదాంట్లో ఉద్యోగులకు మరింత చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఉద్యోగుల ఆవేదనను రెచ్చగొట్టి తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న విపక్షాలకు భంగపాటు ఎదురైంది. ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదానికి తెరపడింది.. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం అయ్యాయి.. ఇక, ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉన్న దాంట్లో మేలు చేయగలిగితే ఉద్యోగులకు ఇంకా చేయాలని సీఎం చెప్పారన్న ఆయన.. అదనంగా భారం అయినా కూడా అధికారులు సీఎంతో మాట్లాడి అన్ని విషయాలు సర్దుబాటు చేశామన్నారు. ఇంకా కొన్ని కోరికలు ఉన్నా కూడా భవిష్యత్ లో దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.
విభజన కష్టాలు, కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వల్లే ఫిట్మెంట్ పెంచలేకపోయామన్నారు.ఆర్థిక భారమైనా హెచ్ఆర్ఏ, సీసీఏ ద్వారా అదనపు ప్రయోజనాలు పొందేలా చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత చూపించడం.. చిన్న అపశృతిగా అభిప్రాయపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఇదిలా ఉండగా.. ఉద్యోగుల నిరసన టీకప్పులో తుఫాన్ లాంటిదని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ… ఉద్యోగుల ఆందోళన, ఆవేశాలను మేం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. ఉద్యోగులు ఛలో విజయవాడ ద్వారా తమ అసంతృప్తిని తెలిపినందున ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించిందన్నారు. అయితే, ఫిట్‌మెంట్ మినహా మిగిలిన అంశాల్లో ఎంతో కొంత పునరుద్ధరించారని సంతృప్తి వ్యక్తంచేసిన ఆయన.. ఫిట్‌మెంట్ విషయంలో ఆశించిన రీతిలో నిర్ణయం రాలేదన్నారు. మరో మూడు అంశాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఫిట్‌మెంట్ తప్ప సీసీఎ, హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటం ఫించన్ పై ఆశాజనకంగా ఉంది.. మంత్రుల కమిటీని రెగ్యులర్ కమిటీగా మార్చాలని సీఎస్ ను సీఎం జగన్ ఆదేశించారు.. ఇకపై మేం కూడా మంత్రుల కమిటీతో సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు.