Idream media
Idream media
సుమారు 40 దేశాలకు పైగా నేవీ దళాలు విశాఖపట్నంలో సందడి చేయనున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మిలాన్-2022 కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 4 వరకు ఇవి కొనసాగుతాయి. పొరుగు, మిత్రదేశాలతో నేవీ విన్యాసాలు చేయడాన్నే మిలాన్ అంటారు. ఇది 1994లో మొదలైంది. ప్రతీ రెండేళ్లకోసారి అండమాన్‌లో నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో మిలాన్‌లో పాల్గొనడానికి ఎక్కువ దేశాలు ఆసక్తి చూపడం, అండమాన్‌లో అందుకు తగిన వసతి లేకపోవడంతో ఈసారి విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు.
వాస్తవానికి ఇది 2020లోనే జరగాల్సింది. కరోనా కారణంగా వాయిదా పడింది. సముద్రంలో వివిధ నౌకాదళాలు చేసే విన్యాసాలను తీరం నుంచి ప్రజలు తిలకించవచ్చు. ఆపరేషన్ డెమో, ఆకాశంలో విన్యాసాలు (ఫ్లై పాస్ట్), ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ వంటి కార్యక్రమాలుంటాయి. ఈ నెల 27న సిటీ పరేడ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హాజరవుతారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో బీచ్ రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన రహదారుల మరమ్మత్తులతోపాటు, ప్రముఖ పర్యాటక కేంద్రాలు, సందర్శనీయ స్థలాలకు మరమ్మత్తులు చేసి, కొత్త హంగులు అద్దుతున్నారు.
అంతేకాకుండా రాష్ట్రపతి నౌకాదళ సమీక్ష (ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ) కూడా జరగనుంది. రాష్ట్రపతి దేశ సర్వ సైన్యాధ్యక్షుడు. త్రివిధ దళలాలకు ముఖ్య అధిపతి. ఐదేళ్లు రాష్ట్రపతిగా కొనసాగేవారు ఏదో ఒక సమయంలో దళాలను సమీక్షిస్తారు. దానినే ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్)గా పిలుస్తారు. ఇందులో పూర్తిగా భారతదేశ నౌకలే పాల్గొంటాయి. విదేశీ నౌకలు కూడా పాల్గొంటే.. దానిని ‘అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ’ (ఐఎఫ్‌ఆర్)గా పిలుస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులు 11 సార్లు ఫ్లీట్ రివ్యూ చేశారు. అందులో రెండుసార్లు విదేశీ నౌకలు కూడా పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమాలు ఎక్కువగా ముంబై కేంద్రంగా జరుగుతుంటాయి. అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2006లో విశాఖపట్నంలో ఫ్లీట్ రివ్యూ చేశారు. అలాగే 2016లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగా ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రిప్యూ నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్నది 12వ పీఎఫ్‌ఆర్. విశాఖపట్నంలో మూడవది. దీనికి ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతున్నారు. విశాఖలో రెండు రోజులుంటారు. ఈ నెల 21న ఫ్లీట్ రివ్యూ ఉంటుంది. ఒకరోజు ముందుగానే ప్రధాని, ఉపరాష్ట్రపతి, రక్షణశాఖ మంత్రి వంటి ప్రముఖలు ఇక్కడికి వస్తారు. ఈ కార్యక్రమం అంతా సముద్రంలోనే జరుగుతుంది. ముఖ్య అతిథులు, మీడియాను సముద్రంలోకి తీసుకువెళ్లి ఈ వేడుకలను చూపిస్తారు. నగర ప్రజలు వీటిని వీక్షించే అవకాశం లేదు.