లాక్ డౌన్ రివ్యూ 66 – పసితనపు ఉగ్రవాదం

ఈ ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటించిన రెండో సినిమా నేరుగా ఓటిటి రిలీజ్ అందుకుంది. ఆ మధ్య సడక్ 2 నిరాశపరచడంతో అభిమానుల ఆశలన్నీ తోర్ బాజ్ మీదే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ మూవీ ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. టెర్రరిజం నేపధ్యం కావడంతో కంటెంట్ తో పాటు మెసేజ్ కూడా ఉండొచ్చనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అసలు హీరోయినే లేకుండా మొత్తం తన భుజంపై వేసుకుని నడిపించిన సంజయ్ దత్ ఫైనల్ గా దీన్నుంచి ఎలాంటి ఫలితం అందుకున్నాడో రివ్యూలో చూద్దాం

కథ

పసిపిల్లల్లో కూడా తీవ్రవాదం పెచ్చుమీరుతున్న ఆఫ్ఘానిస్తాన్ లో ఉండే సోషల్ వర్కర్ అయేషా(నర్గిస్ ఫక్రి)అభ్యర్థన మేరకు అక్కడ మార్పు తీసుకొచ్చేనందుకు ఇండియా నుంచి వస్తాడు డాక్టర్ నసీర్(సంజయ్ దత్). స్కూల్ కు వెళ్లాల్సిన పిల్లలను తుపాకులు పట్టుకునేలా చేసి ఆత్మహుతి దళాలుగా మారుస్తున్న తాలిబన్ టెర్రరిస్ట్ లీడర్ ఖాజర్(రాహుల్ దేవ్)ఎన్నో ప్రాంతాలను తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. నసీర్ అక్కడికి చేరుకున్నాక ఆ పిల్లలో క్రికెట్ మీద ఉన్న విపరీతమైన ఆసక్తిని గుర్తించి వాళ్లకు సరైన కోచింగ్ దక్కేలా చర్యలు తీసుకుంటాడు. అయితే ఖాజర్ ముఠా నుంచి అభ్యంతరం వస్తుంది. ఈ సమస్యను నసీర్ ఎలా పరిష్కరించాడు, చివరికి అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా అనేదే అసలు స్టోరీ

నటీనటులు

సంజయ్ దత్ కు ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు. గతంలో లంహా, మిషన్ కాశ్మీర్ తదితర చిత్రాల్లో చాలానే చేశాడు. ఇది కూడా అదే కోవలోకి వస్తుంది. క్యారెక్టర్ డిమాండ్ కు తగ్గట్టు తన అనుభవాన్ని ఉపయోగించి హుందాగా చేశాడు. మరీ అద్భుతం బెస్ట్ ఇన్ కెరీర్ అని చెప్పే అవకాశం కనిపించలేదు కానీ ఫ్యాన్స్ వరకు సంతృప్తినిస్తుంది. నర్గిస్ ఫక్రీ ఫస్ట్ హాఫ్ లో కాసేపు కనిపించాక మాయమవుతుంది. పెర్ఫార్మన్స్ పరంగా చెప్పుకోవడానికి ఏమి లేదు. జిహాదీ నాయకుడిగా చేసిన రాహుల్ దేవ్ ఎప్పటిలాగే చేసుకుంటూ పోయాడు. స్పెషల్ అయితే కాదు. మిగిలినవాళ్లలో చూసుకుంటే గెవీ చాహల్, కువర్ జీత్ చోప్రా, హుమాయూన్, రాహుల్ మిత్రా, ప్రియాంకా వర్మ తదితరులు ఆయా పాత్రలకు తగ్గట్టు ఓకే అనిపించారు

డైరెక్టర్ అండ్ టీమ్

గిరీష్ మలిక్ తీసుకున్న పాయింట్ లో కొత్తదనం ఉంది. ఆఫ్ఘన్ లో తీవ్రవాదానికి క్రికెట్ కు ముడిపెట్టి కథ రాసుకోవడం వినూత్న ప్రయత్నమే. అయితే స్టోరీ లైన్ చాలా చిన్నది కావడంతో రెండు గంటలకు పైగా సాగే కథనం చాలా చోట్ల నెమ్మదిగా సాగుతుంది. అద్భుతమైన కెమెరా విజువల్స్, లొకేషన్స్ తో మొదలుపెట్టి ఆసక్తి రేపిన తర్వాత ఉన్నట్టుండి టెంపో బాగా స్లో అయిపోతుంది. సంజయ్ దత్ కు పెట్టిన ఫ్లాష్ బ్యాక్, భార్యాపిల్లాడు బాంబు బ్లాస్ట్ లో చనిపోవడం అంత ఎమోషనల్ గా పండలేదు. తన వెనుక ఉన్న బాధను మనం ఫీలయ్యే రేంజ్ లో గిరీష్ ఆ ఎపిసోడ్ ని డిజైన్ చేయలేకపోయాడు.

నిజానికి జీహాది టెర్రటిస్టులు ఎంత క్రూరంగా ఉంటారో ఎంత నిర్దయగా ప్రవర్తిస్తారో ప్రపంచానికంతా తెలుసు. అలాంటిది నసీర్ ఒక్క క్రికెట్ మ్యాచ్ కోసం రక్తం కార్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రతిపాదన చేయగానే ఖాజర్ ఒప్పుకోవడం లాజిక్ కు దూరంగా అనిపిస్తుంది. దానికి తోడు కాబూల్, తోర్ బాజ్ టీమ్స్ మధ్య క్లైమాక్స్ ముందు వచ్చే క్రికెట్ మ్యాచ్ ని చాలా సేపు సాగదీశారు. చివరికి ఏమవుతుందో తెలిశాక కూడా అంత లెన్త్ పెంచడం అవసరం లేదు. కానీ చివరిలో ఊహించని విధంగా ముగించడం బాగుంది. పరిష్కారమే లేని సమస్యను డిఫరెంట్ గా ఆలోచించి ప్లాన్ చేయడం బాగుంది.

బిక్రమ్ ఘోష్-విక్రమ్ మొంత్రోస్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు బాగుంది. రెగ్యులర్ కమర్షియల్ సాంగ్స్ కాదు కాబట్టి ఉన్న రెండు డీప్ గా ఎమోషనల్ టచ్ తో సాగాయి. హిరూ కేశ్వాని ఛాయాగ్రహణం మాత్రం సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. మొదటిసారి బిష్కెక్ లొకేషన్ లో చిత్రీకరించడంలో తన పనితనం మొత్తం చూపించాడు. దిలీప్ డియో ఎడిటింగ్ మాత్రం ఇంకొంచెం నిడివిని తగ్గించి ఉంటే బాగుండేది. మాత్రం చాలా బాగున్నాయి.

కంక్లూజన్

బాలీవుడ్ లో గత దశాబ్దకాలంలో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఈ కాన్సెప్ట్ కి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ని జోడించడంతో తోర్ బాజ్ ప్రత్యేకత సంతరించుకుంది. అంతమాత్రాన ఇది స్పెషల్ మూవీ కాలేదు. స్లోగా సాగే స్క్రీన్ ప్లే, మధ్యలో బాగా ల్యాగ్ ఎక్కువ కావడంతో దీన్నో క్లాసిక్ గా మార్చే అవకాశాన్ని పోగొట్టేశాయి. ఎక్కువ ఆశించకుండా, ఏవేవో థ్రిల్స్, యాక్షన్స్ ఊహించుకోకుండా ఉంటేనే యావరేజ్ అనిపించడం కష్టం. అలా కాదని టైటిల్ ని బట్టో ట్రైలర్ ని చూసో ముందే ఏదేదో ప్రిపేర్ అయిపోయి చూస్తే మాత్రం నిరాశ తప్పదు. కాకపోతే సడక్ 2 కంటే కొంత నయం అంతే.

తోర్ బాజ్ – క్రికెట్ లో నలిగిన టెర్రరిజం

Show comments