లఖీంపూర్‌ కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్‌.. కోర్టు చెప్పిన కారణాలివే..!

నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు లఖీంపూర్‌ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటన కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఆరోజు ఆందోళన చేస్తున్న రైతులపై ఓ ఎస్‌యూవీ వాహనం దూసుకుపోయిన ఘటనలో ముగ్గురు రైతులు, ఓ జర్నలిస్టు మృతి, తదనంతర హింసలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఎస్‌యూవీ డ్రైవర్‌, మరొకరు మృతిచెందారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కేంద్రంపైనే విమర్శలను మరింత పెంచింది.

అయితే, కేసులో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రానే నిందితుడని రైతులు ఆరోపించారు. సిట్‌ దర్యాప్తులోనూ ఎస్‌యూవీలో ఆశిష్‌ ఉన్నట్లు గుర్తించారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుని, దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో.. అక్టోబరు 6న ఆశిష్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అదే నెల 9వ తేదీన జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. పలుమార్లు కస్టడీకి తీసుకుని, విచారించినా.. ఆశిష్‌ సహకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో గత నెల 3న 5,000 పేజీల చార్జిషీట్‌ దాఖలైంది. ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ కోసం ఆశిష్‌ మిశ్రా పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

కోర్టు చెప్పిన కారణాలేంటంటే.. ‘‘థార్‌ ఎస్‌యూవీ సృష్టించిన మారణకాండను మరిచిపోలేదు. ఈ విషయంలో కళ్లు మూసుకోలేదు. అది దారుణమైన ఘటన’’ అని పేర్కొన్న అలహాబాద్‌ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్‌.. ఆశిష్‌కు బెయిల్‌ మంజూరు చేయడానికి కారణాలను వివరించింది. ప్రధానంగా దర్యాప్తు తీరు సరిగాలేదని పేర్కొంది. నిందితుడు ఆశిష్‌పై అభియోగాల్లో స్పష్టతలేదని తెలిపింది. ‘‘ఆశిష్‌ తుపాకీతో కాల్చి చంపాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కానీ, అక్కడ కాల్పులు జరిగాయనడానికి ఆధారాలు లేవు. మృతదేహాల ఒంట్లో తుపాకీ తూటాలు లేవు. క్షతగ్రాతులకూ తూటా గాయాలు లేవు’’ అని వివరించింది.

‘‘కారు వేగాన్ని పెంచి, ఆందోళన చేస్తున్న రైతులపైకి పోనివ్వాలంటూ డ్రైవర్‌(శ్యామ్‌ సుందర్‌)ను ఆశిష్‌ ప్రేరేపించినట్లు దర్యాప్తులో పేర్కొన్నారు. కానీ, తదనంతర హింసలో డ్రైవర్‌ చనిపోయాడు. ఇక పోలీసులు పిలిచినప్పుడు ఆశిష్‌ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో దాఖలైన చార్జిషీటు కేవలం నలుగురు నిందితులకు సంబంధించినదే’’ అని స్పష్టం చేసింది. ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ మంజూరు కావడం పట్ల విపక్షాలు భగ్గుమన్నాయి.

Also Read : కర్ణాటక తరహా వివాదాలు జరగనివ్వం అంటున్న ఎమ్మెల్యే

Show comments