Idream media
Idream media
కర్ణాటక నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అంశం హిజాబ్. మండ్యలో మంగళవారం హిజాబ్ ధరించి కాలేజీకి వస్తూ మరోవర్గం విద్యార్థుల అవహేళనకు గురైన ముస్కాన్ అనే విద్యార్థిని ఉదంతం సామాజిక మాద్యమాల్లో సంచలనంగా మారింది. ఆమెకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ప్రధానంగా విద్యాసంస్థలను కుదిపేస్తున్న హిజాబ్ అంశంపై హైకోర్టు సత్వరం స్పందించింది. ఇప్పటివరకు ఏకసభ్య బెంచ్ జరుపుతున్న విచారణ బుధవారం ఫుల్ బెంచ్‌కు మారింది. ఈ అంశానికి ఉన్న సున్నితత్వం రీత్యా వ్యాజ్యాన్ని ఫుల్ బెంచ్‌కు అప్పగించాలని న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ కోరిన కొద్ది గంటల్లోనే చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి ఈ నిర్ణయం తీసుకున్నారు. త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటుచేశారు.
ఈ ధర్మాసనం అత్యవసర ప్రాతిపదకన గురువారం విచారణను చేపట్టనుంది. కాగా, ఈ వ్యవహారంలో మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మరోవైపు హైకోర్టు తీర్పు వచ్చేంతవరకు సంయమనం పాటించాలని విద్యార్థులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. స్కూళ్లు, కాలేజీల పరిధిలో నూతన ఆదేశాలు జారీచేసింది. యూనిఫాం ధారణను తప్పనిసరి చేసింది. మరోవైపు హిజాబ్ వివాదంపై అనుసరించాల్సిన వైఖరిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. మంత్రులు, అధికారులు, అడ్వకేట్ జనరల్‌తో సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. 18 జిల్లాల్లోని 55 కళాశాలల్లో హిజాబ్, కాషాయ కండువాలతో ప్రదర్శనలు, ఘర్షణలు జరిగాయని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర… సీఎంకు వివరించారు. కాగా, బెంగళూరులోని కళాశాలల్లో రెండు వారాలపాటు విద్యార్థుల ప్రదర్శనలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది.
విద్యార్థిని ముస్కాన్‌కు సంఘీభావంగా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, విద్యార్థి సంఘాలు గళమెత్తాయి. ఢిల్లీ యూనివర్సిటీలో కొన్ని సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కోల్‌కతాలో విద్యార్థులు హిజాబ్ అంశంపై రోడ్డెక్కారు. జమాతే ఉలేమా హింద్ సంస్థ.. ముస్కాన్‌కు రూ. ఐదు లక్షల నజరానా ప్రకటించింది. హిజాబ్ వివాదం మహారాష్ట్రనూ తాకింది. ‘పహ్‌లే హిజాబ్..ఫిర్ కితాబ్’ అనే నినాదాలు రాసిన పోస్టర్లు ఆ రాష్ట్ర సరిహద్దుల్లోని బీద్ జిల్లాలో అక్కడకక్కడా కనిపించాయి. ఎంఐఎం కార్యకర్తలు ఈ పోస్టర్లు అతికించారు. కాగా, ముస్కాన్ ఉదంతంపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. కాలేజీలో ఆమెను ఎవరూ అడ్డగించలేదని, ఏ వర్గం విద్యార్థులూ అటకాయించి అవహేళన చేయలేదని విద్యా మంత్రి బీసీ నగేశ్ తెలిపారు.