భారత స్టార్ బౌలర్ యార్కర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా తొలి టెస్టు ఆడుతున్నాడు. మీరు చదువుతున్నది నిజమే.. అదేంటి ఇప్పటికే 17 టెస్టులు ఆడాడు కదా.. అనుకుంటున్నారా.. బుమ్రా టెస్టుల్లో అరంగేట్రం చేసి మూడేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకూ స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడలేదు. 2021 ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ద్వారా బుమ్రా స్వదేశంలో తొలి టెస్టు ఆడుతున్నాడు.
తనదైన యార్కర్లతో బ్యాట్స్మెన్ కు ముచ్చెమటలు పట్టించే జస్ప్రీత్ బుమ్రా 2016లోనే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసి జట్టులో ప్రధాన బౌలర్ గా ఎదిగాడు. 2018 జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేసాడు. అప్పటినుండి స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడే అవకాశం దక్కలేదు. ఇప్పటివరకు బుమ్రా 17 టెస్టుల్లో 79 వికెట్లు పడగొట్టగా 5 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం గమనార్హం. అంతేగాక అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే 8 మ్యాచ్‌ల్లో 48 వికెట్లతో ఆకట్టుకుని ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
స్వదేశంలో తొలి టెస్టు ఆడుతున్న బుమ్రా ఇంగ్లండ్ ని ఎలా ఎదుర్కొంటాడో అని ఐసీసీ ట్వీట్ చేసింది. కాగా చెపాక్ స్టేడియంలో జరుగుతున్న టెస్టులో అద్భుతమైన ఫామ్ లో ఉన్న జో రూట్ కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్నాడు. ఈ టెస్టుకు ముందు టీం ఇండియా ఇంగ్లండ్ జట్లు విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజయం సాధించగా ఇంగ్లాండ్ శ్రీలంకపై విజయం సాధించింది. దీంతో రెండు జట్లూ సమానంగా కనిపిస్తున్నాయి.
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ టీమ్‌ఇండియాతో పాటు ఇంగ్లాండ్ జట్టుకూ ఎంతో కీలకం కానుంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించగా, మిగిలిన స్థానానికి భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్లో టీమ్‌ఇండియా కివీస్‌తో పోటీపడాలంటే సిరీస్‌ను 2-0 లేదా అంతకన్నా ఎక్కువ తేడాతో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.