Idream media
Idream media
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ కు ఇప్పుడు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఒక వైపు మంత్రాలు, మరోవైపు ఆధ్మాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ముచ్చింతల్ మురిసిపోతోంది. జిల్లాలు, రాష్ట్రాల నుంచే కాదు.. దేశంలోని ప్రముఖులు కూడా ముచ్చింతల్ లో అడుగు పెడుగుతున్నారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నలభై ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఆశ్రమంలో జరుగుతున్న సమతామూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు విచ్చేస్తున్నారు. మూడు రోజుల క్రితమే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేసి 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆశ్రమానికి విచ్చేసి రామానుజాచార్యులను దర్శించుకున్నారు. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సమతామూర్తి సన్నిధికి విచ్చేశారు.
విజయవాడ నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ విమానాశ్రయం నుంచి నేరుగా ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలకు హాజరయ్యారు. చినజీయర్ స్వామి, మై హోం అధినేత రామేశ్వర్ రావు , టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , గువ్వల బాలరాజు పలువురు నేతలు జగన్ కు స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజలలో జగన్ పాల్గొన్నారు. 108 దివ్య ఆలయాలను, సమతామూర్తిని దర్శించుకున్నారు.
ముచ్చింతల్ లో రోజూ ఐదు వేల మంది రుత్వికులు పూజల్లో పాల్గొంటున్నారు.చినజీయర్ స్వామి ప్రవచనాలు వినడానికి, యాగాలను తిలకించడానికి ప్రముఖులతో పాటు ఎక్కడి నుంచో ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ముచ్చింతల్ ప్రాంతం సందడి సందడిగా మారింది. 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహం కలిగిన ముచ్చింతల్ మరో అద్భుత పర్యాటక క్షేత్రంగా మారుతుందని అంటున్నారు. సహస్రాబ్ది ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల పద్నాలుగు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.