Idream media
Idream media
నిర్ధేశిత ప్రమాణాలు లేని ప్రయివేటు విద్య సంస్థలను మూసివేసేందుకు ఆంద్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో నిబంధనల అమలు, నాణ్యతా ప్రమాణాల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. విద్యా రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సీఎం వైఎస్ జగన్‌తో మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, ఉన్నత విద్యలపై తమ సిఫార్సుల నివేదికను ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ ముఖ్యమంత్రికి సమర్పించారు. కమిటీ సిఫార్సులపై సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు. సిఫార్సుల అమల్లోనూ కమిటీ భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు
ప్రైవేటు విద్యాసంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని.. వీటిని నియంత్రించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని తనిఖీలు చేపట్టాలని సూచించారు. సరైన సదుపాయాలు, ప్రమాణాలు పాటించని వాటిని మూసివేయాలని ఆదేశించారు.
100 ఎకరాలు ఉంటేనే వ్యవసాయ కళాశాలకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యవసాయ కళాశాలల్లో ఈ మేరకు భూమి ఉండడం లేదని, విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విద్య అనేది వ్యాపారం కోసమో, డబ్బు కోసమో కాదు. దీన్ని ఒక ఛారిటీలా నిర్వహించాలి.’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.