కనిగిరిలో పట్టు కోసం ఆ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ఫలించేనా..?

అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటారు. ఆ నేతలే మాజీలు అయితే అలాంటి వేడుకల జోలికి వెళ్లరు. కనీసం బర్త్ డే రోజు కూడా సదరు నేతలకు, వారి అనుచరులకు గుర్తుండదు. అలాంటిది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోని ఓ మాజీ ఎమ్మెల్యే తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం నిజంగా ఆశ్చర్యమే. ఆ స్థాయిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం వెనుక కారణం లేకపోలేదు. మళ్లీ ఎమ్మెల్యే అవ్వాలనే బలమైన కాంక్షతోనే సదరు నేత భారీ స్థాయిలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారనే చర్చ సాగుతోంది. ఆ నేత ఎవరో కాదు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి. 

ఈ నెల 8వ తేదీ (మంగళవారం)న ఉగ్రనరసింహారెడ్డి తన బర్త్‌డే వేడుకలను పీసీ పల్లి మండలం పరిధిలోని పాలేటి (పాలేరు) గంగమ్మ తల్లి (కనిగిరి – కందుకూరు రోడ్డు) వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. పాలేరుపై నిర్మించిన పాలేటిపల్లి రిజర్వాయర్‌ నిండడంతో గంగమ్మ తల్లికి పొంగళ్లు పెడుతున్నానంటూ.. తన జన్మదిన వేడుకలను ఉగ్రనరసింహారెడ్డి నిర్వహించారు. భారీ ఎత్తున పొట్టేళ్లను బలి ఇచ్చి.. జన్మదిన వేడుకలకు వచ్చిన వారికి మాంసాహార భోజనం పెట్టారు. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి), డోలా బాల వీరాంజనేయ స్వామి (కొండపి), ఏలూరి సాంబశివరావు (పర్చూరు)లతోపాటు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పుట్టిన రోజు వేడుకలను ఈ స్థాయిలో నిర్వహించడం వెనుక ఉగ్రనరసింహారెడ్డికి పెద్ద ప్రణాళికే ఉంది. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరపున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. పోయిన సారి భారీ ఓటమిని మూటగట్టుకున్న ఉగ్రనరసింహారెడ్డి.. ఈ సారి అయినా గెలుపు రుచి చూస్తానా..? లేదా..? అనే సందేహంతో ఉన్నారు. గత మూడేళ్లుగా ప్రజల్లోనే ఉంటున్నా.. ప్రజలు తనను ఆదరిస్తారా..? లేదా..? అనే సందేహాలు ఆయన్ను వెంటాడుతున్నాయి. తన గత చరిత్రతోపాటు, వైసీపీ సంస్కరణల పాలన, అవినీతిలేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్న నేపథ్యంలో.. గెలుపుపై తనకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు, కాంగ్రెస్‌ పార్టీ మూలాలు ఉన్న తనకు టీడీపీలో ఎంత బలం ఉందో తెలుసుకోవడం కోసం ఉగ్రనరసింహా రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను వేదికగా చేసుకున్నారు.

కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలానికి చెందిన ఉగ్రనరసింహారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ పార్టీ యువజన విభాగంలో అనేక పదవులు నిర్వహించారు. 2009లో యువజన కోటాలోనే కనిగిరి సీటును గట్టి పోటీ మధ్య సంపాదించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డిని కాదని, సినీ నటుడు బాల కృష్ణ స్నేహితుడు, 2004లో దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబూరావుకు టిక్కెట్‌ ఇచ్చింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 ఎన్నికలు మినహా 2004 వరకు టీడీపీ తరపున ముక్కు కాశిరెడ్డి, కాంగ్రెస్‌ తరఫున ఇరిగినేని తిరుపతి నాయుడులు తలపడ్డారు. వారిద్దరు లేని ఎన్నికలు 2009లో జరిగాయి. కదిరి బాబూరావుది కూడా కనిగిరి నియోజకవర్గం పరిధిలోని సీఎస్‌ పురం మండలమే. ప్రత్యర్థులు ఇద్దరిదీ స్థానికమే కావడంతో పోరు హోరాహోరీగా ఉంటుందని భావించారు. 2004 వరకు కనిగిరిలో ఏ పార్టీ గెలిచినా ఆధిక్యం ఆరేడువేల ఓట్లు మాత్రమే.

అయితే కదిరి బాబూరావు నామినేషన్‌ పరిశీలనలో చెల్లకుండా పోయింది. కోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చంద్రబాబు జోక్యం చేసుకున్నా.. రిటర్నింగ్‌ అధికారి ససేమిరా అన్నారు. ఈ పరిణామంతో ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి గెలుపు నల్లేరుమీద నడకేనని కాంగ్రెస్‌ శ్రేణులు భావించాయి. గెలుపు విషయం వదిలేసి.. మెజారిటీపై లెక్కలు వేసుకోసాగారు. అయితే నామినేషన్‌ చెల్లకపోయిన ఘటన నుంచి వెంటనే తేరుకున్న కదిరిబాబూరావు.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన తన సమీప బంధువు సుంకర మధుసూధన్‌ రావు (ఉంగరం గుర్తు) కు మద్ధతు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గుర్తు.. ఉంగరం గుర్తుగా మారిపోయింది. టీడీపీ ఓట్లను ఉంగరం గుర్తుకు వేయించేందుకు టీడీపీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన పని చేశాయి. ఉగ్ర గెలుపు నల్లేరు మీద నడక అని అనుకున్న అంచనాలు పోలింగ్‌ రోజు తర్వాత పటాపంచలయ్యాయి. భారీ మెజారిటీ వస్తుందని లెక్కలు వేసుకున్న ఉగ్ర, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు గెలుపుపై సందేహాలు మొదలయ్యాయి. పోలింగ్‌ తర్వాత ఒక్క ఓటు మెజారిటీతోనైనా గెలుస్తామనే మేకపోతు గాంభీర్యాన్ని చూపాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు తలెత్తింది. మొత్తం మీద చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా.. ఉగ్రనరసింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థి సుంకర మధుసూధన్‌ రావు పై 2,935 ఓట్ల స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు.

వైఎస్‌ మరణాంతరం మారిన రాజకీయ పరిణామాల్లో.. కాంగ్రెస్‌లో ఉండాలా..? లేదా వైఎస్‌ జగన్‌ వెంట నడవాలా..? అనే విషయంపై చర్చించేందుకు రాష్ట్రంలోనే తొలిసారి 2011లో కార్యకర్తల సమావేశం నిర్వహించి ఉగ్ర అందరి దృష్టిని ఆకర్షించారు. కార్యకర్తలు అందరూ జగన్‌వెంట నడవాలని ఏకకంఠంతో కోరారు. ఒక కార్యకర్త సమావేశం జరిగిన ఆర్‌అండ్‌బీ భవనంపై నుంచి దూకడంతో గాయాలయ్యాయి. అందరి ఆకాంక్ష మేరకు జగన్‌ వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించిన ఉగ్ర.. ఆ తర్వాత అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి జోక్యంతో మిన్నుకుండిపోయారు. ఆ తర్వాత కాలంలో పలుమార్లు వైసీపీపై, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌పై విమర్శలు కూడా చేశారు. మొదట మూడేళ్లు ఎలాంటి అభివృద్ధి పనులు చేయని ఉగ్ర పై విమర్శలతోపాటు పలు ఆరోపణలు వచ్చాయి. అయితే వైఎస్‌ జగన్‌ వెంట నడవకుండా ఉన్న పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్న ఉగ్ర.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంజూరు చేయించుకున్నారు. పొగాకు వేలం యార్డు, పాలేరు వాగుపై పాలేటిపల్లి వద్ద చిన్నపాటి రిజర్వాయర్‌ (అలుగుతో కూడిన చెరువు), కనిగిరి, కందుకూరు మధ్యలో పాలేరు వాగుపై బ్రిడ్జి.. సహా పలు పనులు ఉగ్ర హయాంలో జరిగాయి.

2014 ఎన్నికల వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న ఉగ్ర.. ఆ ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే గత చరిత్ర కారణంగా ఆయనకు వైసీపీలో రెడ్‌సిగ్నల్‌ పడింది. దాంతోపాటు జిల్లా నేత, ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉన్న బేధాభిప్రాయాలు ఉగ్రకు వైసీపీలో ఎంట్రీకి అడ్డుపడ్డాయి. టీడీపీ వైపు చూసిన అక్కడ 2009 ఎన్నికల్లో నామినేషన్‌ చెల్లకుండా పోయిన కదిరిబాబూరావును కాదని టిక్కెట్‌ మరొకరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ తరపునే పోటీ చేసిన ఉగ్ర.. తను గెలిచినప్పుడు వచ్చిన మెజారిటీ (2,935) కన్నా తక్కువగా 2,663 ఓట్లు మాత్రమే సంపాదించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రస్తుత కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు 7,107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

2014 ఎన్నికల తర్వాత కూడా వైసీపీలోకి వచ్చేందుకు ఉగ్ర ప్రయత్నాలు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో టిక్కెట్‌ తనకే ఇవ్వాలనే హామీని కోరారు. ఈ తరహా తీరుతో ఉన్న ఉగ్రకు వైసీపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. అందుకు ఆయనకు వచ్చిన 2,663 స్వల్ప ఓట్లు అడ్డంకిగా మారాయి. అదే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కురసాల కన్నబాబుకు వైసీపీ రెడ్‌కార్పెట్‌ పరిచింది. సీటుపై హామీ ఇవ్వడమే కాకుండా తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అందుకు ఆయనకు వచ్చిన ఓట్లే బాసటగా నిలిచాయి. ఆ ఎన్నికల్లో కురసాల కన్నబాబు రెండో స్థానంలో నిలిచారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఈ తరహా సమీకరణాలతో ఉన్న వైసీపీ.. పార్టీలో చేరి, పని చేయండి.. టిక్కెట్‌ విషయం తర్వాత మాట్లాడదాం.. అనే ఆఫర్‌ ఉగ్రకు ఇచ్చింది. అందుకు ఉగ్ర సమ్మతించలేదు. ఆ తర్వాత చేరేందుకు ప్రయత్నాలు చేసినా.. సఫలం కాలేదు. 2019 ఎన్నికల ముందు వరకు వైసీపీలో టిక్కెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేసినా.. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఐదేళ్లు నియోజవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్న బుర్రా మధుసూధన్‌ యాదవ్‌కే జగన్‌ టిక్కెట్‌ ఇచ్చారు.

ఎలాగైన పోటీ చేయాలని, లేదంటే రాజకీయంగా ఇక భవిష్యత్‌ ఉండదనే భావనతో ఉన్న ఉగ్రకు టీడీపీలోని పరిణామాలు కలిసివచ్చాయి. ఒంగోలు పార్లమెంట్‌ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున లోక్‌ సభ అభ్యర్థిగా నిలవడంతో.. టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. ఈ సమయంలో దర్శి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవరావును బలవంతం మీద టీడీపీ ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేయించింది. దర్శిలో ఖాళీ అయిన సీటును ఉగ్రకు కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే తాను కనిగిరిలోనే పోటీ చేస్తానని ఉగ్ర చెప్పడం, దర్శి నుంచి వైసీపీ అభ్యర్థిగా బలిజ సామాజికవర్గానికి చెందిన మద్ధిశెట్టి వేణుగోపాల్‌ పోటీ చేస్తుండడంతో అదే సామాజికవర్గానికి చెందిన కనిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శికి పంపారు. రెడ్డి సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న కనిగిరిలో వైసీపీ తరపున యాదవ సామాజికవర్గానికి చెందిన బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ పోటీ చేస్తుండడంతో.. ఉగ్ర నరసింహా’రెడ్డి’ అభ్యర్థి అయితే సామాజిక వర్గాల సమీకరణలో అటు దర్శి, ఇటు కనిగిరిలోనూ గెలుపొందవచ్చనే ప్రణాళికను చంద్రబాబు వేసుకున్నారు. అయితే ఆయన అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. అటు ఒంగోలు లోక్‌సభతోపాటు దర్శి, కనిగిరిల్లోనూ టీడీపీ ఓడిపోయింది. కనిగిరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 40,903 ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ గెలిచింది.

2019 ఎన్నికల తర్వాత కదిరి బాబూరావు వైసీపీలో చేరారు. ఈ సారి కూడా టీడీపీ టిక్కెట్‌ ఉగ్రకే ఖాయం కావడంతో.. నియోజవకర్గంపై పట్టు కోసం ఉగ్ర తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్నారు. అధికార పార్టీలో అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో రెడ్లకు ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం టీడీపీ చేస్తోంది. పట్టు కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న ఉగ్ర.. వైసీపీ ప్రజా రంజక పాలనను దాటుకుని, గత ఎన్నికల్లో ఘోర ఓటమి తాలుకూ గాయాలను మాన్పుకుని, దుందుడుకు స్వభావం, మాటజారే తత్వం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారనే అపవాదుల మధ్య అనుకున్న లక్ష్యం చేరగలరా..?

Also Read : రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ దూకుడు.. కనిగిరిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

Show comments