Idream media
Idream media
దాదాపు వారం రోజులుగా ఏం జరగబోతుంది ఏంటి అనే ఉత్కంఠ ను కొనసాగిస్తున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేడు కీలక దశకు చేరుకుంది. పలు కారణాలతో రెండు రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కు సంబంధించి అధికార విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్లిన నేపథ్యంలో ఇది పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ అంశానికి సంబంధించి కాస్త సీరియస్ గా దృష్టి పెట్టగా, ఎలా అయినాసరే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పట్టుదలగా ముందుకు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో కాస్త ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రెండు రోజుల నుంచి సభలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి శివ నారాయణ రెడ్డి ఎన్నికను వాయిదా వేస్తూ వెళ్తున్నారు. ఇక దీనికి సంబంధించి హైకోర్టు కూడా జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఎలా అయినాసరే ఎన్నికల సంఘం నేడు ఈ ఎన్నికల్లో పూర్తిచేసే దిశగా ఏర్పాట్లు చేసింది.
రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసి ఇరు పార్టీల నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిక కు సంబంధం ఉండే సభ్యులు మాత్రమే మున్సిపల్ కార్యాలయానికి రావాలి అని ఇతర నాయకులు ఎవరూ కూడా రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గాని, అధికార పార్టీ నుంచి ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు గానీ రావడానికి వీలు లేదని, కేవలం గెలిచిన సభ్యులు అలాగే ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునే విజయవాడ ఎంపీ కేశినేని నాని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రమే రావాలని స్పష్టం చేశారు.
లోపల కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. ఇక రెండు పార్టీలు కూడా క్యాంప్ రాజకీయాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో కాసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసిపి సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని టీడీపీ సభ్యులతో అక్కడికి చేరుకున్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా తెలుగుదేశం పార్టీ 14 గెలిచింది. వైసిపి కూడా 14 గెలవగా ఇండిపెండెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇక ఎక్స్ అఫిషియో ఓటు కి సంబంధించి తెలుగుదేశానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉండగా వైసీపీకి వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ బలం 16 చేరుకోగా వైసిపి బలం 15 గా ఉంది.
Also Read : Kondapalli – గందరగోళం మధ్య చైర్మన్ ఎన్నిక వాయిదా