iDreamPost
iDreamPost
నిన్న నితిన్ భీష్మ పాజిటివ్ రిపోర్ట్స్ తో ఓపెన్ అయ్యింది. శివరాత్రి సెలవును పూర్తిగా వాడుకుంటూ చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో నితిన్ కెరీర్ బెస్ట్ వచ్చే దిశగా సాగుతోంది. వీకెండ్ ఉంది కాబట్టి మంచి ఫిగర్స్ నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టార్ క్యాస్టింగ్ తో పాటు హిట్ ట్రాక్ ఉన్న దర్శకుడి మూవీ కాబట్టి అందరూ భీష్మనే టార్గెట్ చేశారు కానీ దాంతో పాటు మరో మూడు చిన్న సినిమాలు కూడా విడుదలయ్యాయి. వాటి రిపోర్ట్ ఎలా ఉందో సింపుల్ గా చూసేద్దాం
లక్ష్ చదలవాడ, దిగంగనా సూర్యవంశీ జంటగా రూపొందిన వలయం క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందింది. కొత్తగా పెళ్ళై సంతోషంగా ఉన్న భార్యాభర్తలు అరవింద్(లక్ష్)దిశా(దిగంగన) జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. దిశ కనిపించకుండా పోతుంది. అక్కడి నుంచి అన్వేషణ మొదలవుతుంది. అసలు దిశ ఏమయ్యింది, ప్రాణాలతోనే ఉందా లేక ఎవరైనా ఏదైనా ఘాతుకానికి పాల్పడ్డారా అనేదే అసలు కథ. దర్శకుడు రమేష్ కుదుముల టేకాఫ్ బాగానే ఉన్నప్పటికీ ఆపై కథను చెప్పే క్రమంలో విపరీతంగా తడబాటుకు గురి కావడంతో ఆసక్తిగా సాగాల్సిన థ్రిల్లర్ నీరసంగా వెళ్తుంది. హీరో కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ బాగా చేసాడంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. మొత్తానికి వలయం ఆశించిన అంచనాలు అందుకోలేకపోయింది.
జంట దర్శకులు సుజోయ్-సుశీల్ ప్రెషర్ కుక్కర్ ప్రమోషన్ టైం లో మంచి ఆసక్తి రేపింది. రోనక్, ప్రీతీ జంటగా రూపొందిన ఈ మూవీలో తనికెళ్ళ భరణి, సంగీత, రాహుల్ రామకృష్ణ లాంటి సీనియర్లు ఉన్నారు. కిషోర్(సాయి రోనక్)ని ఎలాగైనా అమెరికా పంపించి గొప్పవాడిగా చూడాలని కలలు కంటుంటాడు తండ్రి(సివిఎల్ నరసింహారావు) . కాని కిషోర్ ఎన్ని వీసా ప్రయత్నాలు చేసినా ఫెయిలవుతుంటాయి. దాంతో హైదరాబాద్ కు వచ్చిన అతని జీవితం ప్రీతీ పరిచయంతో కొత్త మలుపులు తీసుకుంటుంది. చివరికి కిషోర్ నాన్న అమెరికా కలను నేరవేర్చాడా లేదా అనేదే బాలన్స్ కథ. ఎంచుకున్న థీమ్ లో ఫ్రెష్ నెస్ ఉన్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా మలచకలేకపోయారు దర్శకులు. స్క్రీన్ ప్లే లోపాల వల్ల ఎంటర్ టైన్మెంట్ లేక చప్పగా సాగుతుంది. హీరో హీరొయిన్లు బాగా చేసినప్పటికీ స్క్రిప్ట్ సపోర్ట్ చేయకపోవడంతో ప్రెజర్ కుక్కర్ కావాల్సిన విజిల్స్ ఊదకుండానే గ్యాస్ ఆర్పేసింది
ఇక ఆఖరుది అసలు వచ్చిందో లేదో కూడా అర్థం కానంత వీక్ పబ్లిసిటీ చేసుకున్న చీమా ప్రేమ మధ్యలో భామ. ఓ చీమ శివుడి వరం వల్ల మనిషిగా మారి ప్రేమలో పడే గొప్ప పాయింట్ తో దర్శకుడు శ్రీకాంత్ అప్పలరాజు దీన్ని తీర్చిద్దిద్ధాడు. రాజమౌళి ఈగని స్ఫూర్తిగా తీసుకున్నారు కాని మరీ సిల్లీ రైటింగ్ తో ఎక్కడా మెప్పించేలా కథనం సాగదు. ట్రీట్ మెంట్, ఎంటర్ టైన్మెంట్ దేనికవే తక్కువ క్వాలిటీ ఇవ్వడానికి పోటీ పడ్డాయి.చివరి దాకా కూర్చున్నవాళ్ళు గ్రేట్ అనిపించేలా ఓపికకు పరీక్ష పెట్టేశారు.
మొత్తానికి భీష్మతో తలపడే సాహసం చేసిన మూడు సినిమాలలో కనీసం పోటీ ఇచ్చే మ్యాటర్ లేదని అర్థమైపోయింది. చిన్న సినిమాలను ప్రోత్సహించమని కోరే వాటి దర్శక నిర్మాతలు కాస్త కంటెంట్ పైన కూడా శ్రద్ధ పెట్టి ప్రేక్షకులకు ఏం కావాలో వాటిని అందించే ప్రయత్నం చేస్తే కనీసం డిజిటల్ రూపంలోనైనా ఆదరించే ఛాన్స్ దొరుకుతుంది. అంతే తప్ప బడ్జెట్ నిర్మాత ఉన్నారు కదా అని తోచింది తీసుకుంటూ పోతే పదే పదే తిరస్కారాలు తప్పవు.