హర్యానా ఫలితాలపై రైతు ఉద్యమ ప్రభావముందా?

  • Published - 05:55 AM, Thu - 31 December 20
హర్యానా ఫలితాలపై రైతు ఉద్యమ ప్రభావముందా?

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిలో పంజాబు, హర్యానా రైతులు ముందు వరుసలో ఉన్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు బీజేపీకి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయా? అంటే అవుననే సమాధానం లభిస్తోంది. తాజాగా జరిగిన హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ దాని మిత్ర పక్షమైన జననాయక్ జనతా పార్టీ కూటమికి చేదు అనుభవం ఎదురైంది. మూడు మేయర్ స్థానాలకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఒకే ఒక స్థానం లభించింది.

ఈ ఫలితాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి?

సోనిపట్, అంబాలా, పంచకుల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జేజేపీ కూటమికి గట్టి పోటీ ఎదురైంది. అంబాలా, పంచకుల, సోనీపట్ కార్పోరేషన్లతో పాటు రెవారి సివిక్ బాడీ
చీఫ్, ధరుహేరా, సంప్లా, ఉక్లానా మున్సిపల్ కమిటీకి డిసెంబర్ 27న ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. మూడు మేయర్ స్థానాల్లో సోనిపట్ కార్పోరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, అంబాలా మేయర్ స్థానాన్ని జన చేతన పార్టీ సొంతం చేసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సింఘూ బార్డర్ కు సమీపంలోనే సోనిపట్ ఉండడం గమనార్హం. రైతు ఉద్యమ ప్రభావ ఫలితమే బీజేపీ ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంబాలా మేయర్ స్థానాన్ని హర్యానా జనచేతన పార్టీకి చెందిన శక్తి రాణి శర్మ మేయర్ పదవిని దక్కించుకోనున్నారు. కేవలం పంచకులలో మాత్రమే బీజేపీ మేయర్ స్థానాన్ని దక్కించుకోగలిగింది. ఉప ముఖ్యమంత్రి, జేజేపీ అధినేత దుశ్యంత్ చౌతాలా సొంత జిల్లాలోనూ ప్రభావం చూపలేకపోయారు. ఉల్కనా, ధరుహేరా సివిక్ బాడీ చీఫ్ పదవులను దక్కించుకోలేకపోయింది జేజేపీ. బీజేపీ కేవలం రెవారి సివిక్ బాడీ చీఫ్ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. 2018లో హిసార్, కర్నల్, పాణిపట్, రోహ్టక్, యమునానగర్ మేయర్ స్థానాలను దక్కించుకున్న బీజేపీకి రెండేళ్లు తిరగక ముందే ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయ చట్టాల విషయంలో బీజేపీ వైఖరి కారణంగా ఫలితాలు తారుమారయ్యాయని విశ్లేషకులు అంటుండగా బీజేపీ నేతలు మాత్రం తామకు ప్రజల మద్దతు ఉందని అంటున్నారు.

Show comments