ఆంధ్రప్రదేశ్‌లో అధికారులకు అంత పవర్‌ ఇచ్చారా..?

విధులు నిర్వర్తించడంలో అధికారులకు స్వేచ్ఛనిస్తే.. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నాయి. కోవిడ్‌ సమయంలో ప్రజలకు సేవలు అందించడంలోనూ, అందడంలోనూ, వారిని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీ నుంచి కాపాడడంలోనూ అధికారుల కృషి అమోఘం.

కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు బాధితుల నుంచి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేశాయి. ఇందులో కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆయా ఆస్పత్రులపై అధికారులు కొరఢా ఝులిపించారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి పక్షపాత ధోరిణితో వ్యవహరించకపోవడం పరిపాలనలో వచ్చిన మార్పునకు సంకేతం. సీఎం సొంత జిల్లా వైఎస్సార్‌ కడపలోని ఆస్పత్రులకు అధికారులు జరిమానా విధించారు. జరిమానా విధించడంతో.. సేవలు అందించబోమని బ్లాక్‌మెయిల్‌ చేసే ధోరణిలో బోర్డులు పెట్టిన ఆస్పత్రులను దారికి తీసుకురావడంలోనూ అధికారులు తమదైన శైలిలో వ్యవహరించారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ ఆస్పత్రి డోపిడీని కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి బట్టబయలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపించిన కలెక్టర్‌.. సదరు ఆస్పత్రి వసూలు చేసిన మొత్తానికి ఏడు రెట్లు అ«నంగా జరిమానా విధించారు. అంతేకాకుండా అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని బాధిత కుటుంబానికి తిరిగి ఇప్పించారు.

కాకినాడకు చెందిన ఓబిలిశెట్టి సత్యనారాయణ గత నెల 14వ తేదీన కరోనా బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నగరంలోని సాయిసుధ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందారు. ఆస్పత్రి యాజమాన్యం చికిత్స అందించినందుకు 14 లక్షల రూపాయలు బిల్లు వేసింది. ఆ మొత్తాన్ని చెల్లించిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు.. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించిన కలెక్టర్‌.. ఆస్పత్రి 3.16 లక్షలే చికిత్సకు తీసుకొవాల్సి ఉండగా.. 10.84 లక్షలు అదనంగా తీసుకుందని నిర్థారించారు. అదనంగా వసూలు చేసిన మొత్తానికి ఏడు రెట్లు.. 75.88 లక్షల రూపాయలు ఆస్పత్రికి జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని ఆస్పత్రి యాజమాన్యం చెక్కు రూపంలో కలెక్టర్‌కు అందించింది. దాంతోపాటు అదనంగా వసూలు చేసిన 10.84 లక్షల రూపాయలను కూడా బాధిత కుటుంబానికి కలెక్టర్‌ ఇప్పించారు.

అధికారులు ఈ తరహాలో పని చేయడం మునుపెన్నడూ జరగలేదు. గత ప్రభుత్వ హాయంలో అధికారులపై దాడులు జరిగినా.. ఇసుక దందాను అడ్డుకోబోయిన మహిళా తహసీల్దార్‌ను జుట్టుపట్టుకు ఈడ్చినా.. కాల్‌మనీ పేరుతో మహిళలపై అఘాయిత్యాలు చేసినా.. ఎవరిపైనా ఎలాంటి చర్యలు లేవు. పైగా ప్రజా ప్రతినిధులు చెప్పిందే చట్టం. చేసిందే న్యాయం అన్నట్లుగా అధికారులు కూడా పని చేయాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలన సాగుతోంది. ఎవరి పని వారు తమ పరిధిలో పక్కాగా నిర్వర్తిస్తున్నారు. అధికారులను స్వేచ్ఛగా పనిచేయనిస్తే.. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో సాయిసుధ ఆస్పత్రి వ్యవహారంమే ఓ నిదర్శనం.

Also Read : ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఎలా జరిగింది?

Show comments