చైనాలో దొరికిన అరుణాచల్ యువకుడు.. మిస్సింగా? కిడ్నాపా?

  • Updated - 10:21 PM, Fri - 11 March 22
చైనాలో దొరికిన అరుణాచల్ యువకుడు.. మిస్సింగా? కిడ్నాపా?

ఎట్టకేలకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి అదృశ్యమైన యువకుడిని చైనా భారత్‌కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు. “చైనీస్ PLA అరుణాచల్ ప్రదేశ్ యువకుడు మిరామ్ టారోన్‌ను భారత సైన్యానికి అప్పగించింది”. గురువారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని వాచా దమై వద్ద భారత యువకుడు మిరామ్ టారోన్‌ను పిఎల్‌ఎ సైన్యానికి అప్పగించినట్లు ఆయన తన ట్వీట్‌లో వెల్లడించారు. వైద్య పరీక్షలతో సహా సరైన విధానాలు పాటించి అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నామని వెల్లడించారు. అదే సమయంలో, అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గావో కూడా ట్వీట్ చేసి, భారత సైన్యం మరియు భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. దీనిపై వెంటనే భారత సైన్యం చర్యలు చేపట్టిందని, అందువల్లే ఇది సాధ్యమైందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల మిరామ్ టారోన్ జనవరి 18న అప్పర్ సియాంగ్ జిల్లాలోని జిడో గ్రామం నుంచి అదృశ్యం అయ్యాడు. మిరామ్ టారోన్ ని తన సహచరుడితో ఉన్న సమయంలో చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గావో తన ట్వీట్‌లో ఆరోపించారు. ఆ తర్వాత, యువకుడిని గుర్తించి తిరిగి తీసుకురావడానికి సహాయం కోసం భారత సైన్యం చైనా వైపు సంప్రదించింది. ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ ప్రకారం యువకుడిని గుర్తించి తిరిగి పంపిస్తామని చైనా పక్షం హామీ ఇచ్చింది. తరువాత జనవరి 20న చైనా పక్షంవారు తమ భూభాగంలో ఒక యువకుడిని కనుగొన్నామని, గుర్తింపును ఖరారు చేయడానికి మరిన్ని వివరాలను అభ్యర్థించారు.

ఆ వివరాలు చెక్ చేసిన తరువాత అదృశ్యమైన భారతీయ యువకుడి ఆచూకీ లభించిందని చైనా తెలిపింది. యువకులు ఇద్దరూ అరుణాచల్ ప్రదేశ్ స్థానిక వేటగాళ్ళు కాగా సెయుంగాలా ప్రాంతంలోని లుంగ్టా జోర్ ప్రాంతం నుంచి వారిలో ఒకరిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసింది. ఈ సంఘటన త్సాంగ్పో నదికి సమీపంలో జరిగింది. త్సాంగ్పో నది చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. భారతదేశంలో ఆ నదిని వివిధ పేర్లతో పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్ అని, అస్సాంలో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు.

Show comments