Cooking Oil Prices – వంట నూనెల ధరలు.. కేంద్రం కంటితుడుపు చర్యలు

దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలిసారి సామాన్య జనం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ధరాభారంతో బతుకుబండి లాగడం కష్టమైన ప్రజలకు దీపావళి పండగ కానుక అనేలా ధరలు తగ్గించే చర్యలు తీసుకుంటోంది. మొన్న బుధవారం పెట్రోల్, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా వంటనూనెల ధరలను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లీటర్‌.. పామాయిల్‌పై 20 రూపాయలు, వేరుశెనగ ఆయిల్‌పై 18, సోయాబీన్‌ ఆయిల్‌పై 10, పొద్దుతిరుగుడు నూనెపై 7 రూపాయలు తగ్గిస్తున్నట్లు తెలిపింది.

కంటితుడుపు చర్యలు..

పెట్రోల్, వంటనూనెల ధరలు కొండంత పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వాటి ధరలను గోరంత తగ్గించి.. పండగ చేసుకోండంటూ చెబుతోంది. ఏడాది క్రితం పెట్రోల్, డీజిల్‌ ధరలు 70 – 80 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు ఆ ధరలు 110 రూపాయల మార్క్‌ను చేరుకున్నాయి. వాటిపై పెట్రోల్‌కు ఐదు, డీజిల్‌కు 10 రూపాయల చొప్పన తగ్గించిన కేంద్రం.. ప్రజలకు ఏదో మేలు చేసినట్లుగా భావిస్తోంది. ఇప్పుడు వంట నూనెల ధరల విషయంలోనూ అదే తీరును అవలంభించింది. ఏడాదిలోనే వంటనూనెల ధరలు రెట్టింపు అయ్యాయి. ఏడాది క్రితం పామాయిల్‌ ధర లీటర్‌ 60–70 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు ఆ ధర లీటర్‌ 140–150 రూపాయల మధ్య ఉంది.

లీటర్‌ ఆయిల్‌పై కనిష్టంగా 70 రూపాయలు పెంచిన కేంద్రం.. ఇప్పుడు 20 రూపాయలు తగ్గించింది. అదే విధంగా సన్‌ప్లవర్‌ ఆయిల్‌ 70–80 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు ఆ ధర 155–165 రూపాయల మధ్య ఉంది. దీనిపై లీటర్‌కు 7 రూపాయలు తగ్గించింది. పెరిగిన ధరలకు, తగ్గించిన ధరలకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఈ తగ్గించిన ధరలు.. సామాన్యులకి ఎంత మేరకు ఊరటనివ్వగలవో పాలకులు ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నారా..? అనే విషయం ధరలు తగ్గించామని గొప్పలు పోతున్న బీజేపీ నేతలు ఒక్కసారి ఆలోచించాలి.

Also Read : Excise Duty Reduction – మోదీ దీపావళి బహుమతి.. పెట్రో వడ్డనకు బ్రేకులు.. అంతే!

Show comments